టీవీకే పార్టీకి గుడ్‌న్యూస్‌ | Supreme Courts Slams Madras HC Over Orders Against TVK MLA | Sakshi
Sakshi News home page

టీవీకే పార్టీకి గుడ్‌న్యూస్‌

May 13 2026 12:52 PM | Updated on May 13 2026 1:28 PM

Supreme Courts Slams Madras HC Over Orders Against TVK MLA

సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.

ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్‌లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అసలేం జరిగింది..
తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్‌ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్‌ హైకోర్టును ఆశ్రయించారు.

శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్‌ (కుడి)

శనివారం ఆయన పిటిషన్‌ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్‌ సవాల్‌ చేస్తుండడం.. ఆయన ఓటింగ్‌లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్‌కు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అంగీకరించారు. 

సుప్రీంలో ఇవాళ.. 
బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్‌ తరఫున మకుల్‌ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ బెంచ్‌ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్‌ వేసిన రిట్‌ పిటిషన్‌ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .

సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్‌ టీవీకే సర్కార్‌ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్‌ వేసిన ఎన్నికల పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement