సిగరెట్‌ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Supreme Court Declines Plea For Warning Labels On Liquor Bottles - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం  బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు.

పిటిషన్‌ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంపై లా కమిషన్‌ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top