
న్యూఢిల్లీ: నావికా దళంలోని యుద్ధ విమానం మొట్టమొదటి మహిళా పైలట్‌గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పునియా రికార్డు సృష్టించనున్నారు. నేవీలో మహిళా యుద్ధ విమాన పైలట్ల నూతన శకానికి ఆమె నాంది పలకనున్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్టణ తీరంలోని ఐఎన్‌ఎస్ డేగాపై సెకండ్ బేసిక్ హాక్ కన్వెర్షన్ కోర్సు స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ అతుల్ ధుల్, సబ్ లెఫ్టినెంట్ పునియాకు ప్రతిష్టాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అందుకున్నారు. దీంతో, నావికాదళ యుద్ధ విమానాలలోకి ప్రవేశించిన మొదటి మహిళగా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా నిలిచారు. త్వరలోనే ఆమె ఫైటర్ పైలట్‌గా శిక్షణను అందుకోనున్నారు. నేవీలో ఇప్పటికే మహిళా పైలట్లు, ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్‌గా పనిచేస్తున్నారు.