చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

Special Package to Handloom Vijaya sai Reddy Rajya Sabha - Sakshi

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: చేనేత రంగానికి వెంటనే ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ రాజ్యజభ సభ్యులు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో దాదాపు 31 లక్షల కుటుంబాలు చేనేత రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నాయి. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల్లో 87 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రంగంలో పని చేస్తున్న వారిలో 72 శాతం మహిలే. చేనేత కార్మికులలో 68 శాతం వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్ర ఇక్కట్లకు గురైంది. చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోయింది. అమ్మకాలు జరగకపోవడంతో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది. చేనేత కార్మికులపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. చేసేందుకు పనిలేక చేనేత కార్మికులు కుటుంబాలను పోషించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారని విజయసాయి రెడ్డి వివరించారు.

చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి)

చేనేత రంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఆయన చెప్పారు. మొదటిది మార్చి 2020 నుంచి జనవరి 2022 మధ్యలో పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగిపోయాయి. నూలు అందుబాటు ధరలకు లభ్యం కానందున చేనేత రంగం ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. రెండోది.. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన రెండేళ్ల వ్యవధిలో పేద, బడుగు వర్గాలకు చెందిన చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించలేదని విజయసాయి రెడ్డి అన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత రంగం పునరుజ్జీవనం కోసం తక్షణం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్తి, నూలు వంటి ముడి సరుకులను సబ్సిడీపై అందించడంతోపాటు చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top