Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!

Special Court Orders To OPS And EPS To Appear In Defamation Case - Sakshi

ఈపీఎస్, ఓపీఎస్‌లకు ప్రత్యేక కోర్టు ఆదేశం 

పిటిషన్ల తిరస్కరణ 

సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని  పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్‌ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్‌ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్‌ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.  

కొడనాడు కేసులో.. వాదోపవాదాలు  
కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్‌ కుమార్‌ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్‌షీట్‌ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు వాదించారు.

స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top