
ఒక్క మాటతో ఫొటోలు, వీడియోలు తీసిపెట్టే స్మార్ట్ గ్లాసెస్
ఫోన్ అవసరం లేకుండానే కాల్స్ మాట్లాడే అవకాశం
సంగీతం, పాడ్‌కాస్ట్‌లు వినేందుకు హెడ్‌ఫోన్లతో పనేలేదు
ఇటీవల సంయుక్తంగా ఆవిష్కరించిన మెటా– రేబాన్
అదే బాటలో మరికొన్ని దిగ్గజ మొబైల్ కంపెనీలు
ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ఫోన్‌కుప్రత్యామ్నాయం కాబోవంటున్న నిపుణులు
ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్‌మనిపిస్తుంది.. వాయిస్ కమాండ్ వినగానే వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్ లేకుండానే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్ కంపెనీ.. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్ గ్లాసె స్‌ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానున్నాయి.
అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్‌పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్ గేమ్–ఛేంజర్‌గా నిలుస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ విలువ 18.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐఎమ్‌ఏఆర్‌సీ గ్రూప్ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్
ఏమిటీ గ్లాసెస్ ప్రత్యేకత?
వాయిస్ అసిస్టెంట్: మెటా ఏఐతో సంభాషించి రియల్ టైమ్ సమాధానాలు పొందవచ్చు.
ఫొటో, వీడియో క్యాప్చర్: వాయిస్ కమాండ్‌తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్: ఏదైనా కార్యక్రమానికి ఇన్‌స్ట్రాగామ్ లేదా ఫేస్‌బుక్‌లో నేరుగా ప్రసారం చేయవచ్చు.
సంగీతం, పాడ్‌కాస్ట్‌లు: ఇయర్‌బడ్స్ లేకుండానే సంగీతం లేదా పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు.
ఫోన్ కాల్స్: బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్స్ స్వీకరించవచ్చు.
లైవ్ ట్రాన్స్‌లేషన్: విదేశీ భాషల సైన్‌బోర్డ్‌లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.
ఆబ్జెక్ట్ రికగ్నిషన్: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్‌లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు.
స్క్రీన్ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్ తెర అవసరం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.
స్మార్ట్ గ్లాసెస్ ప్రయోజనాలు..
సహజ కదలిక: స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేదు.
మల్టీ టాస్కింగ్: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్‌ఫోన్ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు.
తక్కువ స్క్రీన్ టైమ్: నిరంతర ఫోన్‌ను చూస్తూ స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ఎదురయ్యే సవాళ్లు..
బ్యాటరీ లైఫ్: రోజంతా గ్లాసెస్‌ను చార్జ్‌లో ఉంచడం కష్టం.
వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది.
ధర: ఈ హై–టెక్ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.
అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ వాచ్‌ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ కంటే బెటర్..
త్వరలోనే ఈ గ్లాసెస్ స్మార్ట్‌ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్‌ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్‌ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్‌కు బదులుగా వాయిస్ కమాండ్స్, విజువల్స్‌తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’
– మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీఈఓ