హోటల్‌ కస్టమర్లపై ఎస్‌ఐ ఓవరాక్షన్‌

SI Overaction On Hotel Customers In T Nagar, Chennai - Sakshi

భోజనం చేస్తుండగా లాఠీతో వీరంగం

బాధితుల ఫిర్యాదుతో స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ 

ఎస్‌ఐపై బదిలీ వేటు

సాక్షి, టీ.నగర్‌: కోవైలో హోటల్‌ కస్టమర్లపై దాడికి సంబంధించి ఎస్‌ఐపై బదిలీ వేటు పడింది. వివరాలు..హోసూరుకు చెందిన మహిళల సహా ఐదుగురు ఆదివారం కోయంబత్తూరు గాంధీపురం బస్టాండు చేరుకున్నారు. చాలావరకు హోటళ్లు మూసి ఉండడంతో భోజనం చేసేందుకు హోటళ్ల కోసం వెతికారు. ఒకచోట సగం షట్టర్‌ మూసి పనిచేస్తున్న ఓ హోటల్‌ను చూసి అక్కడికి వెళ్లారు. వారితో పాటు మరికొందరు అక్కడ భోజనం చేస్తుండగా, బస్టాండులో గస్తీకి వచ్చిన కాటూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు ఆ హోటల్‌ పనిచేస్తుండడం చూసి లోనికి ప్రవేశించారు. మహిళలతో సహా ఎనిమిది మందికి పైగా భోజనం చేస్తుండటం గమనించి వారిపై, హోటల్‌ సిబ్బందిపై వీరంగం చేశారు.

కరోనా నియంత్రణకు నిర్ణీత సమయంలో హోటల్‌ మూసివేయాలనే ఉత్తర్వులను విస్మరించి, షట్టర్‌ సగం తెరచి వ్యాపారం చేస్తున్నారా? అంటూ హోటల్‌ సిబ్బందిపై లాఠీ ఝుళిపించాడు. భోజనం చేస్తున్నారనే కనికరం కూడా లేకుండా పురుషులు, మహిళలపై కూడా లాఠీతో ప్రతాపం చూపారు. దీంతో ఉద్యోగులు, మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారు. బయటికి వచ్చిన తర్వాత మరికొందరిని లాఠీతో తరిమినట్లు సమాచారం. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన వారు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన దీనిపై విచారణకు ఆదేశించారు. ఎస్‌ఐ హోటల్‌ కస్టమర్లపై దాడిచేయడం వాస్తవమని తేలడంతో ఆయనను కంట్రోల్‌ రూంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

చదవండి: వివాహేతర సంబంధం: ప్రియురాలికి నిప్పంటించి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top