
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రులను కోరారు. ఆదివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు ప్రామాణికతతో నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో ఎరువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సంప్రదాయ ఎరువులతో పాటు నానో–ఎరువులు, బయో–స్టిమ్యులెంట్ ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడాన్ని వెంటనే అరికట్టాలన్నారు. దోషులుగా తేలితే లైసెన్స్‌ల రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తగు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఎరువుల్లో కల్తీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.