దేశవ్యాప్తంగా 3.17 లక్షల దుకాణాల్లో తనిఖీలు
5,119 మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టడమే లక్ష్యంగా ఖరీఫ్‌తోపాటు ప్రస్తుత రబీ సీజన్‌లో మొత్తం 3.17 లక్షల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గురువారం వెల్లడించింది. ఎరువులను నల్లబజారుకు తరలించి, విక్రయిస్తున్న 5,119 మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలియజేసింది. 3,645 లైసెన్స్‌లను రద్దు చేయగా, దేశవ్యాప్తంగా 418 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వివరించింది. ఎరువుల అక్రమ నిల్వలకు సంబంధించి 2,991 షోకాజ్ నోటీసులు జారీ చేయగా, 451 లైసెన్స్‌లను రద్దు చేశామని, 92 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొంది.
అత్యధికంగా మహారాష్ట్రలో 28,273 చోట్ల తనిఖీలు జరగ్గా, బ్లాక్ మార్కెటింగ్‌పై 1,957 షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు 2,730 లైసెన్స్‌లను రద్దు చేశారు. బిహార్, రాజస్తాన్, మహా రాష్ట్ర, హరియాణా, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో నాసిరకం ఎరువులకు సంబంధించి 3,544 షోకాజ్ నోటీసులు జారీ చేయగా, 1,316 లైసెన్స్ రద్దు చేశారు. ఎరువులు సక్రమంగా రైతులకు చేరేలా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. డిజిటల్ డాష్‌బోర్డ్‌లతో ఎరువుల నిల్వల పర్య వేక్షణ, స్వా«దీనం చేసుకున్న లేక నిల్వ చేసిన ఎరువులను సహకార సంఘాలకు వేగంగా మళ్లించడం, రైతుల నుంచి వచి్చన ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారించడంలో కొన్ని రాష్ట్రాల అధికారుల పనితీరును ప్రశంసించింది. చట్టబద్ధంగా, పారదర్శకంగా ఎరువుల పంపిణీకి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.


