breaking news
Fake seed supply
-
కల్తీ ఎరువులపై కఠిన చర్యలు: కేంద్రం∙
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రులను కోరారు. ఆదివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు ప్రామాణికతతో నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎరువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సంప్రదాయ ఎరువులతో పాటు నానో–ఎరువులు, బయో–స్టిమ్యులెంట్ ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడాన్ని వెంటనే అరికట్టాలన్నారు. దోషులుగా తేలితే లైసెన్స్‌ల రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తగు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఎరువుల్లో కల్తీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు: తెలంగాణ డీజీపీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నకిలీ విత్తనాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. కాగా, నకిలీ విత్తనాలపై దాడుల నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 990 కేసులు నమోదు చేశాము. 2014 నుంచి 2022 వరకు 1,932 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పదేపదే నకిలీ విత్తనాలు అమ్ముతున్న 58 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలపై ఎస్పీలు, కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
విత్తన పరిహార చట్టానికి మోక్షమేదీ?
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ దగ్గర పడుతోంది. ప్రభుత్వం విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. మరోవైపు ప్రైవేట్ విత్తన కంపెనీలు మిరప తదితర విత్తనాలను డీలర్లకు చేరవేసే పనిలో ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో నకిలీ విత్తనాలను అడ్డుకునే అధికారం వ్యవసాయ శాఖకు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం అటువంటి చర్యలను నీరుగార్చుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ రైతు ఫిర్యాదుల పరిష్కార విధాన (నకిలీ విత్తన సరఫరాతో పంట నష్టం జరిగినప్పుడు) చట్టం–2016కు ఇప్పటికీ మోక్షం లభించలేదు. గత రెండు అసెంబ్లీ సమావేశాల్లోనూ సంబంధిత బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవడంతో అది చట్టంగా రూపుదిద్దుకోలేకపోయింది. దీంతో ఈసారి కూడా నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడే అస్త్రం వ్యవసాయశాఖ చేతిలో లేకుండా పోయింది. ఆ బిల్లు చట్టమైనట్లయితే నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. నష్టపరిహారం, జైలుశిక్ష వంటి చర్యలు ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేసుకోవడానికి వీలుకలిగేది. గతేడాది నకిలీ మిరప విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయారు. అవి నకిలీ విత్తనాలేనని సర్కారు కూడా తేల్చి చెప్పింది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేలా, వారికి నష్టపరిహారం ఇప్పించేలా చట్టం తీసుకు రావాలని ప్రభుత్వం కూడా భావించింది. కానీ ఆచరణలో మాత్రం చట్టం ఇప్పటికీ రూపుదాల్చలేదు.మిరపకే పరిమితమా!: ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విత్తన చట్టంలో నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టం జరిగితే విత్తన కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే అంశం లేదు. 2007లో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పం టకి నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే ఏపీ కాటన్ సీడ్స్ యాక్ట్–2007ను తీసుకొచ్చారు. అందులో పత్తికి తప్ప మిగతా నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం ఇప్పించే అంశం లేదు. దీంతో ఇతర విత్తనాల్లో కల్తీ జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. అందుకోసమే ప్రభుత్వం విత్తన పరిహార చట్టం–2016కు రూపకల్పన చేసింది. అయితే అది కూడా తాజా గా అనేక మార్పుచేర్పులకు గురైనట్లు తెలిసింది. కేవలం మిరప పంటకు నష్టం జరిగినప్పుడు మాత్రమే పరిహారం వర్తింపజేసేలా బిల్లును రూపొందించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.