ప్రయాగ్‌రాజ్: మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించారు. సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు తన అనుచరులను కూడా అడ్డుకున్నారని శంకరాచార్య అన్నారు. పోలీసులు తన శిష్యులను నెట్టివేసి, దురుసుగా ప్రవర్తించారని.. తన పల్లకిని మధ్యలోనే నిలిపివేశారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సాధువులపై కూడా దాడులు జరుగుతున్నాయని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుని వెనక్కి వచ్చానని ఆయన చెప్పారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మౌని అమావాస్య నాడు తాను పుణ్యస్నానం ఆచరించబోనని స్వామి అవిముక్తేశ్వరానంద్ స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మౌని అమావాస్య ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో సాధువులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు, చలి వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు సంగం ఘాట్‌కు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.
యాత్రికుల భద్రత, రద్దీ నియంత్రణకు సంగం ఘాట్ వద్ద భారీ కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సీసీ టీవీ కెమెరాలను, డ్రోన్‌లతో నిరంతర పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం 6గంటల నుంచి దాదాపు యాభై లక్షల మంది భక్తులు వివిధ ఘాట్ల వద్ద పవిత్ర స్నానం చేశారని డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని.. స్నాన ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా సాగుతోందని.. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.


