ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్‌ ఉత్పత్తి: ఎస్‌ఐఐ

Serum Institute Covid19 Vaccine Will be Distributed by Government - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం ద్వారానే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్‌ అందుతుందని.. ఎవరూ ప్రైవేట్‌లో కొనాల్సిన అవసరం లేదంటుంది సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్ఐ‌ఐ). కరోనా వ్యాక్సిన్‌ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ద్వారానే దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది. అంతేకాక దేశ జనాభా కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయగల సామార్థ్యం తమ సొంతం అన్నది సీరమ్‌. ఆదివారం సీరమ్‌ సీఈఓ అదార్‌ పూనవాలాకి, మరో పార్సీకి మధ్య జరిగిన ట్విటర్‌ సంభాషణ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. రోని స్క్రూవాలా అనే పార్సీ.. అదార్‌ను ఉద్దేశిస్తూ.. ‘పార్సీ సమాజంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ఒక లాబీ పనిచేస్తోంది. కాబట్టి పార్సీల కోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలి’ అంటూ ట్వీట్‌​ చేశారు. దీనిపై అదార్‌ స్పందిస్తూ.. ‘సమాజానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తాం. ఈ గ్రహం మీద ఉన్న పార్సీలను కవర్‌ చేయడానికి మా ఒక్క రోజు ఉత్పత్తి సరిపోతుంది’ అంటూ సరదాగా స్పందించారు. (అక్టోబర్‌–నవంబర్‌లో టీకా)

ఈ క్రమంలో సోమవారం అదార్‌ మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత దేశ ప్రజలు ఎవరూ దీన్ని బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తాం అని తెలిపారు. అంతేకాక నిన్న జరిగిన ట్విటర్‌ సంభాషణ కేవలం ఇద్దరు పార్సీ మిత్రుల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ మాత్రమే’ అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ దాని భాగస్వామి ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్‌ విజయవంతమైన తర్వాత.. దాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం కోసం ఎస్ఐ‌ఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆక్సఫర్డ్‌, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ మూడవ దశ ప్రయోగాలను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు అదార్‌ తెలిపారు. మూడవ దశ హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కోరుతూ ఎస్‌ఐఐ ఇప్పటికే దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎస్‌ఐఐ కరోనా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పూణే, ముంబైలలో ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తోంది. (దేశంలో వ్యాక్సిన్‌ పరీక్షల జోరు)

రెండు నెలల పాటు కొనసాగబోయే ట్రయల్స్‌లో భాగంగా ఆగస్టు చివరి నాటికి పూణే, ముంబైలలో 4,000 నుంచి 5,000 మందికి టీకా ఇంజెక్ట్ చేయనున్నట్లు ఎస్‌ఐఐ గత ప్రకటనలో తెలిపింది. గత వారం వ్యాక్సిన్‌ పరీక్ష ఫలితాల్లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంతృప్తికరమైన పురోగతిని సాధించడంతో.. తరువాతి ట్రయల్స్‌ కోసం ఎస్‌ఐఐ డీసీజీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top