ఇంటి పనుల్లో భర్త పాలుపంచుకోవాలి: సుప్రీం
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది.
క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు.
క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది.


