చ‌నిపోయేవ‌ర‌కు స్వ‌లింగ సంప‌ర్కులని తెలియ‌దు

Same Sex Couple Lived As Heterosexuals For 8 Years In Madhya Pradesh - Sakshi

భోపాల్ : మ‌ధ్య‌ప్రదేశ్‌లోని సెహోర్ ప‌ట్ట‌ణంలో దంప‌తులిద్ద‌రు ఎంతో అన్యోన్య‌తతో జీవించేవారు.వారిద్దరు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతున్నామని.. పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న‌ట్లు కుటుంబస‌భ్యుల‌కు, ఇత‌ర బంధువుల‌కు చెప్పి 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక పిల్లాడిని ద‌త్త‌త తీసుకొని పెంచుకుంటున్నారు. 8 సంవ‌త్స‌రాలుగా త‌మ వైవాహిక జీవితాన్ని ఆనందంతో గ‌డిపేస్తున్నారు.

తాజాగా గ‌త‌నెల ఆగ‌స్టు 11న భార్య‌ భ‌ర్త‌లిద్దరి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. ఆ గొడ‌వ పెద్ద‌దై చివ‌రికి అత‌ని భార్య త‌న శ‌రీరానికి నిప్పు అంటించుకుంది. భార్య‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అత‌నికి కూడా మంట‌లంటుకున్నాయి. ఇంటిప‌క్క‌న ఉన్న వారు విష‌యం తెలుసుకొని వారిద్ద‌రిని భోపాల్ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. దాదాపు 90శాతం కాలిపోయిన వ్య‌క్తి భార్య ఆగ‌స్టు 12న చ‌నిపోగా.. స‌ద‌రు వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మించి ఆగ‌స్టు 16న క‌న్నుమూశాడు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే పోస్టుమార్టం స‌మ‌యంలో భార్య నుంచి తీసిన అటాప్సీ రిపోర్టులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. డాక్ట‌ర్లు వారు ఇచ్చిన  ప్రాథ‌మిక అటాప్సీ రిపోర్టులో చనిపోయిన ఇద్ద‌రు మ‌గ‌వారేనంటూ అనుమానాస్పద ప‌ద్ద‌తిలో పేర్కొన్నారు.  వెంట‌నే ఈ విష‌యాన్ని పోలీసులుకు తెలిపారు. పోలీసులు వ‌చ్చి కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ ప్రారంభించారు.  చనిపోయిన ఇద్ద‌రు మ‌గ‌వారేన‌న్న విష‌యం పోలీసులు కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా మాకు తెలియ‌ద‌ని స‌మాధాన‌మిచ్చారు. దీంతో పూర్తి అటాప్సీ వివ‌రాలు వ‌స్తేనే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని పోలీసులు భావించారు.

చ‌నిపోయిన భార్య అటాప్సీ పూర్తి రిపోర్ట్‌ను ప‌రిశీలించ‌గా.. చ‌నిపోయింది అమ్మాయి కాద‌ని.. అబ్బాయేన‌ని డాక్ట‌ర్లు నిర్థారించారు. ఇదే విష‌య‌మై పోలీసులు మ‌రోసారి కుటుంబ‌స‌భ్యుల‌ను ఆరా తీశారు. చ‌నిపోయిన భ‌ర్త త‌ర‌పు సొంత అన్న‌య్య స్పందించాడు. 'నా త‌మ్ముడు ఎల్జ‌బీటీ ఉద్యమానికి మ‌ద్ద‌తుగా పోరాటం చేసేవాడు. అక్క‌డే అత‌నికి ఒక గే ప‌రిచ‌యం అయ్యాడ‌ని.. మేమిద్ద‌రం క‌లిసి బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు మాతో తెలిపాడు. కానీ మా కుటంబానికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. త‌ర్వాత మాకు తెలియ‌కుండా పెళ్లి చేసుకొని దూరంగా ఉంటున్నట్లు' తెలిపాడు. 8 ఏళ్లుగా సెహూర్ నివ‌సిస్తున్న వారిద్ద‌రు నిజ‌మైన భార్య భ‌ర్త‌ల్లాగా ఉండేవారని.. చ‌నిపోయేంత‌వ‌ర‌కు కూడా స్వ‌లింగ సంప‌ర్కులు అన్న అనుమానం కూడా క‌ల‌గ‌లేద‌ని అక్క‌డి స్థానికులు పేర్కొన్నారు.

అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచుద్, రోహింటన్ ఫాలి నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గే సెక్స్‌ను నేరంగా పరిగణించడం సహేతుకం కాదని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ)లకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top