‘పీ 305’ ప్రమాదంలో 49 మంది మృతి

Rescuers hunt 49 missing as cyclone pummels Indian coast  - Sakshi

మరో 26 మంది కోసం కొనసాగుతున్న గాలింపు

ప్రాణాలతో మిగిలే అవకాశాలు తక్కువేనన్న నేవీ

ముంబై: భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ  తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్‌ బోట్‌ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్‌లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొంది.

టౌటే తుపాను ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన పీ–305 బార్జ్‌ సోమవారం మునిగిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళ విపత్తు సహాయ బృందం గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించింది. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ కొచి, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ బియాస్, ఐఎన్‌ఎస్‌ బెట్వా, ఐఎన్‌ఎస్‌ తేజ్‌లతో పాటు పీ–81 నిఘా విమానం, ఇతర నౌకాదళ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి.  మొత్తంగా 600 మందికిపైగా ఓఎన్‌జీసీ సిబ్బందిని కాపాడామని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. పశ్చిమతీరంలోని చమురు వెలికీతీత కేంద్రాల్లోని మొత్తం 6,961 ఉద్యోగులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కెప్టెన్‌ తేలిగ్గా తీసుకున్నాడు
టౌటే తుపాను హెచ్చరికను పీ–305 బార్జ్‌ కెప్టెన్‌ బల్విందర్‌ సింగ్‌ తేలికగా తీసుకున్నారని దాని చీఫ్‌ ఇంజనీర్‌ రహమాన్‌ షేక్‌ ఆరోపించారు. గాలుల వేగం పెద్దగా ఉండదని, తుపాన్‌ ప్రభావం గంటసేపు మాత్రమే ఉంటుందని చెబుతూ... హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి కారణమయ్యారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమాన్‌ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. కెప్టెన్‌ బల్విందర్‌ గల్లంతైన వారిలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top