Goa: గుండెపోటుతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం | Goa Agriculture Minister and Former CM Ravi Naik Passes Away at 79 | Sakshi
Sakshi News home page

Goa: గుండెపోటుతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

Oct 15 2025 12:06 PM | Updated on Oct 15 2025 1:10 PM

Ravi Naik former CM dies after cardiac arrest

పణజీ: గోవా వ్యవసాయ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్(79) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పీటీఐ తెలిపిన వివరాల పణజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్‌లో మంత్రి రవి నాయక్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పోండాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ  బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

అనంతరం కుటుంబ సభ్యులు నాయక్ మృతదేహాన్ని పోండాలోని ఖడ్పబంద్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.  మంత్రి రవి నాయక్‌కు నివాళులు అర్పించేందుకు పలువురు నేతలు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మంత్రి రవి నాయక్‌కు 
భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
 

ప్రధాని మోదీ సంతాపం
‘గోవా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రవి నాయక్  మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన  నేతగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకునిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపై ఆయన ఆసక్తి చూపారు. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ తన ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు.

గోవా ముఖ్యమంత్రి సంతాపం
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. మంత్రి రవి నాయక్ మృతికి విచారం వ్యక్తం చేశారు. అతని నాయకత్వం, ప్రజా సేవ పట్ల అంకితభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ‘మన సీనియర్ నేత,  క్యాబినెట్ మంత్రి రవి నాయక్ మరణం విచారకరం. గోవా రాజకీయాల్లో ప్రముఖునిగా, ముఖ్యమంత్రిగా దశాబ్దాలుగా ఆయన అంకితభావంతో పనిచేశారు. కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఆయన  ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నాయకత్వం, వినయం  ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ అని సావంత్  ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement