అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?

Rajnath Singh Attacks China At INS Visakhapatnam Induction - Sakshi

చైనాపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం

ముంబైలో ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ జల ప్రవేశం  

ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డ్రాగన్‌ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్‌క్లాస్‌) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు.

కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్‌ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు.

భారత నావికాదళం పాత్ర కీలకం
ఇండో–పసిఫిక్‌ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్‌ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. 

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్‌ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు.

శత్రువుల పాలిట సింహస్వప్నం
ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.

బరువు: 7,400 టన్నులు
పొడవు: 163 మీటర్లు
వెడల్పు:  17.4 మీటర్లు
వేగం: గంటకు 30 నాటికల్‌ మైళ్లు
పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్‌ మైళ్లు ప్రయాణం చేయగలదు   

ఆయుధాలు: 32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు, 16 బ్రహ్మోస్‌ యాంటీషిప్, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు, 76 ఎంఎం సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌మౌంట్,  నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్‌ లాంచర్లు, కాంబాట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, రాకెట్‌ లాంచర్, అటోమేటెడ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌.         

– సాక్షి, విశాఖపట్నం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top