Agnipath Recruitment Scheme: రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి

Rajnath Singh Announcing The Agnipath Scheme - Sakshi

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్‌ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్‌ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు.

తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. 

కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు 
త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్‌ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్‌ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్‌ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు.

సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధురి అన్నారు. అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. 

విపక్షాల పెదవి విరుపు 
అగ్నిపథ్‌ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి.

మాజీల మిశ్రమ స్పందన 
కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) వినోద్‌ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సత్బీర్‌సింగ్‌ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) బీఎస్‌ ధనోవా అభిప్రాయపడ్డారు.

పథకం స్వరూపం... 
►   ఇది ఆఫీసర్‌ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్‌) నియామక ప్రక్రియ. 
►    త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్‌లైన్‌ సెంట్రలైజ్డ్‌ విధానంలో ర్యాలీలు, క్యాంపస్‌ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. 
►   ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. 
►    వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. 
►    త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. 
►    సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్‌ క్లాస్‌’ విధానంలో రిక్రూట్‌మెంట్‌ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్‌ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. 
►    విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. 
►    వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్‌ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. 
►    నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు.
►    సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. 
►    గ్రాట్యుటీ, పెన్షన్‌ బెనిఫిట్స్‌ ఏమీ ఉండవు. 
►    ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. 
►    మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top