Raj Thackeray: లౌడ్‌ స్పీకర్లపై నిరసనలు ఆగవు..

Raj Thackeray Says Loudspeaker Protest Wont Stop, 250 Detained - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్‌ వచ్చే లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్‌ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. 

కాగా హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామని రాజ్‌ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్‌ సమయంలో లౌడ్‌స్పీకర్లను బంద్‌ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్‌బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్‌స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్‌ఎన్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్‌ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.
చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్‌.. ముంబైలో హైఅలర్ట్‌

ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్‌ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top