
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
కాగా బుధవారం ఉదయం వయనాడ్ చేరుకున్న రాహుల్.. కాల్‌పేట నుంచి సివిల్ స్టేషన్ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ వయనాడ్ ప్రజలతో ఉంటానని చెప్పారు. ఇక్కడి ప్రతివ్యక్తి తనపై ప్రేమ, అభిమానాన్ని అందించారని, సొంత వ్యక్తిలా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
ఇక 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఏడు లక్షల ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్ధి సునీర్‌పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే వయనాడ్ నుంచి బీజేపీ తరపు రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, సీపీఐ నేత అనీ రాజా పోటీలో నిలిచారు. రెండో ఫేజ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
చదవండి: అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్