నాడు స్కాములు, నేడు స్కీములు 

Prime Minister Narendra Modi Criticized The Congress Government - Sakshi

యూపీఏ పాలనలో అవిభాజ్యంగా అవినీతి

అందుకు తావు లేకుండా మా పాలన: మోదీ 

షిమ్లా: 2014కు ముందు దేశంలో అవినీతి ప్రభుత్వంలో విడదీయలేని భాగంగా ఉండేదంటూ నాటి కాంగ్రెస్‌ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ‘‘బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో అవినీతిపై ఉక్కుపాదం మోపింది. దాంతో ఈ విషయంలో చెప్పలేనంత మార్పు వచ్చింది. ప్రజలూ దీన్ని గమనిస్తున్నారు’’ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు నిండిన సందర్భంగా షిమ్లాలో మంగళవారం గరీబ్‌ సమ్మాన్‌ నమ్మేళన్‌ పేరిట జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

అప్పట్లో నిత్యం స్కాముల (కుంభకోణాల) గురించి వార్తలు కాగా ఇప్పుడెక్కడ చూసినా స్కీముల (పథకాల) గురించి వార్తలే ఉంటున్నాయన్నారు. దేశ సరిహద్దులు కూడా 2014తో పోలిస్తే ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నాయన్నారు. పలు పథకాల లబ్ధిదారుల జాబితాలోంచి ఏకంగా 9 కోట్ల నకిలీ పేర్లను తాము ఏరివేసినట్టు చెప్పారు. ఏకంగా రూ.22 లక్షల కోట్లను పలు పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామని వివరించారు.

కరోనా కల్లోలాన్ని తమ ప్రభుత్వం ఎంత సమర్థంగా ఎదుర్కొన్నదీ ప్రపంచమంతా చూసిందన్నారు. ప్రజలకు 200 కోట్లకు పై చిలుకు వ్యాక్సీన్లు ఉచితంగా వేశామని గుర్తు చేశారు. అంతేగాక వాటిని ఎన్నో దేశాలకు వాటిని ఎగుమతి చేశామన్నారు. దేశంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుర్తు చేశారు. 

ప్రధాన సేవకున్ని మాత్రమే..
‘‘నన్ను నేను ప్రధానిగా భావించను. ప్రజలకు ప్రధాన సేవకున్ని మాత్రమే అని అనుకుంటాను’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘130 కోట్ల పై చిలుకు భారతీయులతో కూడిన అతి పెద్ద కుటుంబంలో నేను సభ్యున్ని. నా జీవితం వాళ్లకే అంకితం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కర్నాటకలోని కలబుర్గికి చెందిన సంతోషి తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

ఆమె బీజేపీ కార్యకర్త అయి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేవాడినని చెప్పారు. ప్రధాని ముద్రా యోజన కింద రూ.7.2 లక్షల రుణం తీసుకుని 12 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పిన గుజరాత్‌కు చెందిన అర్వింద్‌ పేటల్‌ను అభినందించారు. అందరిలా ఉద్యోగం చేయాలనుకోకుండా ఎందరికో ఉపాధి కల్పిస్తుండటం గొప్ప విషయమన్నారు. 10 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి 11వ విడత కింద రూ.21 వేల కోట్లను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు. 

నోట్ల రద్దు ఎప్పటికీ బాధిస్తుంది: రాహుల్‌ 
న్యూఢిల్లీ: ప్రధాని మోదీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.  మోదీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా  రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ‘2016లో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల్ని రోడ్లపై నిలబెట్టారు. 2016లో 18 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంటే, ఇప్పుడది 31 లక్షల కోట్లకు పెరిగింది. మీ డిజిటల్, కేష్‌లెస్‌ ఇండియా ఏమైనట్టు?’ అన్నారు.

బీజేపీ ఓడితేనే విద్వేష వ్యాప్తికి చెక్‌: మమత
పురూలియా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వెలిబుచ్చారు. బీజేపీ ఓటమితో దేశంలో విద్వేష వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీకి ఢిల్లీలో అధికార పీఠాన్ని చేరే అవకాశమే ఉండదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లయిన నేపథ్యంలో మమత మంగళవారం పురూలియాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top