భుటాన్: ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై స్పందించారు. థింపూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.
‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్‌కు వచ్చాను’’ అని మోదీ చెప్పారు.
రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..
ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టం అంటూ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తాం. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


