Pondicherry: రంగన్న కేబినెట్‌ రెడీ

Pondicherry: CM Rangasamy Cabinet Ready - Sakshi

సాక్షి, చెన్నై: మంత్రివర్గ జాబితాను పుదుచ్చేరి సీఎం రంగస్వామి సిద్ధం చేశారు. బీజేపీకి చెందిన ఇద్దరితో పాటు తన పార్టీకి చెందిన ముగ్గురితో కలిపి ఐదుగురు సభ్యులకు మంత్రి చాన్స్‌ కల్పించారు. ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించనున్నారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌ అధినేత, సీఎం రంగ స్వామికి  మంత్రివర్గం కూర్పు శిరోభారంగా మారింది. తొలుత బీజేపీతో సీట్ల పందేరం వివాదాల నడుమ సాగింది. అధికారపగ్గాలు చేపట్టి నెలన్నర రోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి.

ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఎన్బలం సెల్వం గత వారం స్పీకర్‌గా పగ్గాలు చేపట్టారు. మంత్రివర్గ పంచాయితీ కొలిక్కి రావడంతో జాబితా సిద్ధం చేసే పనిలో రంగన్న నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదన్న సమాచారంతో బీజేపీకి చెందిన జాన్‌కుమార్‌ ఢిల్లీలో పైరవీలో మొదలెట్టే పనిలో పడ్డారు. అయితే ఎళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్న శరవణ కుమార్‌కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే రంగన్న జాబితాలోనూ ఆయన పేరు ఉండడం వెలుగు చూసింది.  

జాన్‌ కుమార్‌కు రిక్త హస్తం 
కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన తనతో పాటుగా తన కుమారుడ్ని ఎన్నికల్లో గెలిపించుకున్న నేత జాన్‌కుమార్‌. అయితే, ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కేది అనుమానంగా మారింది. ఆయన వర్గీయులు ఓ వైపు ఆందోళనలు సాగిస్తున్న నేపథ్యంలో మరో వైపు ఢిల్లీలో జాన్‌కుమార్‌ తిష్ట వేసి ఉండటం గమనార్హం. చివరి వరకు మంత్రి పదవి కోసం అధిష్టానంతో పోరాడుతానని జాన్‌కుమార్‌ ప్రకటించారు. సీఎం అభ్యర్థి కావాల్సిన వ్యక్తినని, బీజేపీ పిలుపు మేరకు ఇక్కడకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. జాన్‌కుమార్‌ ఢిల్లీ వేదికగా పైరవీలు ఓ వైపు సాగిస్తుంటే, మరో వైపు రంగన్న తన మంత్రి వర్గ జాబితాను సిద్ధం చేసి ఎల్జీకి సమర్పించేందుకు సిద్ధం కావడం గమనార్హం.

జాబితాలో బీజేపీకి చెందిన నమశ్శివాయంకు హోంశాఖ, శరవణకుమార్‌కు ఆదిద్రావిడ సంక్షేమ శాఖ కేటయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, తన పార్టీకి చెందిన తిరుమురుగన్‌కు విద్యాశాఖ, లక్ష్మీనారాయణన్‌కు ఆరోగ్యశాఖ, జయకుమార్‌కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించి ఉన్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌గా రాజవేలు, ప్రభుత్వ విప్‌గా ఆర్ముగం పేర్లను ఎంపిక చేసి  ఈనెల 24న ఎల్జీకి జాబితాను రంగన్న సమర్పించబోతున్నట్టు ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి:  శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top