నాన్‌వెజ్‌ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా? | Sakshi
Sakshi News home page

నాన్‌వెజ్‌ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?

Published Tue, Aug 23 2022 7:50 AM

Political War Between BJP And Congress On Non Veg At Karnataka - Sakshi

కర్నాటకలో నాన్‌–వెజ్‌ రాజకీయం భగ్గుమంది. మడికెరిలో మాంసాహార భోజనం చేసి, ఆలయ దర్శనానికి వెళ్తే తప్పేముంది అని సీఎల్పీ నేత సిద్దరామయ్య చెప్పడంపై అధికార బీజేపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇక మడికెరిలో జరిగిన గుడ్ల దాడిని ఖండిస్తూ త్వరలో అక్కడ ధర్నా చేస్తానని హస్తం ప్రకటించడం కూడా వేడెక్కించింది. మొత్తానికి గుడ్లు, నాన్‌ వెజ్‌ ఇప్పుడు రాజకీయాలకు ఘాటైన మసాలాను కలిపాయి. 

మైసూరు/ శివాజీనగర: టిప్పు సుల్తాన్‌ దండయాత్ర చేసినప్పుడే కొడగు ప్రజలు భయపడలేదు, సిద్దరామయ్య వస్తే  భయపడతారా? అని మైసూరు–కొడగు ఎంపీ ప్రతాపసింహ అన్నారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడగులో గుడ్ల దాడి జరిగిందని మళ్లీ కొడగును ముట్టడిస్తామని, అక్కడ భారీ ధర్నా చేస్తామని సిద్దరామయ్య చెబితే ఎవరూ భయపడబోరన్నారు. కొడగు ప్రజలను హత్య చేసిన టిప్పు జయంతిని నిర్వహించిన సిద్దరామయ్యను కొడగు ప్రజలు ఎలా క్షమిస్తారన్నారు. సిద్దరామయ్య భార్య చాముండేశ్వరి అమ్మవారికి భక్తురాలు, ఆమె కూడా మాంసం తిని ఆలయానికి వెళ్తారా? అనేది చెప్పాలన్నారు. పంది మాంసం తిని మీ స్నేహితుడు, ఎమ్మెల్యే అయిన జమీర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్తారా? అని మండిపడ్డారు.  

మాంసాహారం తిని పూజలకు వెళ్లారు 
మైసూరు నగర మాజీ మేయర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ 2017లో దసరా వేడుకల్లో సిద్దరామయ్య మాంసాహార భోజనం చేసి చాముండేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాడని, ఇది నిజమని అన్నారు. లలిత మహాల్‌ ప్యాలెస్‌లో జిల్లా యంత్రాంగం శాకాహార, మాంసాహార భోజనాలను ఏర్పాటు చేయగా, ఆయన మాంసాహారం తిని వచ్చి పూజలకు వెళ్లారన్నారు.   

మొండితనం వద్దు: విజయేంద్ర 
సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహార స్వాతంత్య్రం ఉంది. అయితే మాంసం తిని దేవాలయానికి వెళతానని చెప్పడం మొండితనం, ఇటువంటి వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సీఎల్పీ నేత సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. సోమవారం శిరహట్టిలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక సంస్కృతి సంప్రదాయముంది. మత నిష్ట ఉంది, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదు. మాంసం తిని గుడికి వెళతానని చెప్పడాన్ని నేనొక్కన్నే కాదు రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు అని అన్నారు.  

ప్రజలపై యుద్ధం చేస్తావా: విశ్వనాథ్‌ 
కొడగులో భారీ ధర్నా చేయాలని సిద్దరామయ్య యోచించడం తగదని, దీనిని విరమించుకోవాలని బీజేపి ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్‌ అన్నారు. రాజకీయ నాయకుల పైన ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు, రా­ళ్లు ఇలా ఏవి దొరికితే అవి వెయ్యడం సహజమన్నా­రు. అలాగని ప్రజల మీద యుద్ధం చేయ్యడం సరికాదని, కాబట్టి ధర్నాను మానుకోవాలని సూచించారు.  

శుక్రవారం టెన్షన్‌  
కాగా, వచ్చే శుక్రవారం మడికెరి ఎస్పీ ఆఫీసు ముందు కాంగ్రెస్‌ పార్టీ భారీ ధర్నా చేయనుంది. అదే రోజు మరోచోట బీజేపీ జాగృతి సమావేశం జరపనుంది. దీంతో కాఫీ సీమలో టెన్షన్‌ నెలకొంది.  

పందిమాంసం తిని వెళ్తారా: యత్నాళ్‌ 
సిద్దరామయ్యకు ధైర్యముంటే పంది మాంసం తిని, మసీదుకు వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ సవాల్‌ విసిరారు. సోమవారం విజయపురలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నిచోట్ల మాంసాహారం తిని ఆలయాలకు వెళ్లొచ్చు, కొన్నిచోట్ల వెళ్లడం నిషిద్ధం.  దేవాలయానికి మాంసం తిని వెళ్లకూడదా? అని సిద్దరామయ్య ప్రశ్నించడం దేవున్ని నమ్మే ఆస్తికుల మనసుకు బాధ కలిగించింది. ఆయనకు ధైర్యముంటే పంది మాంసం తిని మసీదుకు వెళ్లాలి అని సవాల్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement