కుటుంబ పార్టీలతో పెద్ద ముప్పు

PM Narendra Modi takes dig at Congress in Constitution Day address - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన

ఒక పార్టీపై తరతరాలుగా పెత్తనం మంచిది కాదు

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవాలు 

26/11 దాడుల్లో మృతిచెందిన వారికి మోదీ నివాళులు

సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి రాజకీయ పార్టీలే పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై ఒకే కుటుంబానికి చెందిన తరతరాల నేతలు పెత్తనం చెలాయించడం మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాల్లో మోదీ ప్రసంగించారు. ‘కుటుంబం కోసం పార్టీ, కుటుంబంతో పార్టీ ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధానికి  సంబంధించినది కాదని అన్నారు.

ఇది  అంబేడ్కర్‌ గౌరవానికి, మన రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన వేడుక అని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీల కారణంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారిదాకా దేశం ఒక రకమైన సంక్షోభం వైపు పయనిస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది సొంత ప్రతిభ, ప్రజల ఆశీర్వాదాలతో ఒక పార్టీలో చేరి రాణిస్తే అది వంశపారంపర్య పార్టీ కాబోదన్నారు. కానీ, పార్టీపై ఒకే కుటుంబం తరతరాలుగా స్వారీ చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందన్నారు.   ముంబైలో 26/11 ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ప్రధాని నివాళులర్పించారు.

అవినీతిపరులను కీర్తిస్తారా?
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. వలసవాద మనస్తత్వం కలిగిన శక్తులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు.

ఇవి పార్లమెంట్‌ వేడుకలు: ఓం బిర్లా
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పార్లమెంట్‌కు చెందినవని, ప్రభుత్వానివి కాదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షాలు పాల్గొంటే బాగుండేదని అన్నారు.  ఉభయ సభల్లో జరిగిన చర్చల డిజిటల్‌ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్‌డ్‌ కాపీ డిజిటల్‌ వెర్షన్, అన్ని సవరణలతో కూడిన రాజ్యాంగ ప్రతిని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్‌ బిర్లా ఆవిష్కరించారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, టీఆర్‌ఎస్‌ ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి: రాష్ట్రపతి కోవింద్‌
రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి మా ట్లాడారు. ఏ పార్టీకి చెందిన సభ్యులైనా పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, విధాన సభ, పార్లమెంట్‌కు ఎంపికయ్యే ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌  గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు.

15 పార్టీలు గైర్హాజరు
రాజ్యాంగ దినోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ తదితర 15 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు బిజూజనతాదళ్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్‌ పార్టీ, టీడీపీ పాల్గొన్నాయి.

ఆదర్శాల ప్రకటనే రాజ్యాంగం: వెంకయ్య
సంభాషణలు, చర్చల ద్వారా చట్టసభలు దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగం అనేది విలువలు, ఆలోచనలు, ఆదర్శాల ప్రకటన అని అన్నారు. సోదరభావం స్ఫూర్తితో అం దరికీ న్యాయం, స్వేచ్ఛ కల్పించిందని తెలిపా రు. జాతీయ ఐక్యత కోసం ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు ప్రజా ప్రతినిధులందరూ కట్టుబడి ఉండాలన్నారు.  

బీజేపీది నిరంకుశ ధోరణి: కాంగ్రెస్‌
దేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందుకే పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన రాజ్యాంగ దినం కార్యక్రమాల్లో తాము పాల్గొన లేదని కాంగ్రెస్‌ తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్‌ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. పార్లమెంట్‌ పరిశీలనతో నిమిత్తం లేకుండానే చేసే చట్టాలు వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ప్రేరేపిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి  
సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ప్రేరేపిత, లక్ష్యంగా చేసుకొని సాగించే దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ఓ పెద్ద కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని చెప్పారు. న్యాయవాదులు అబద్ధాలకు వ్యతిరేకంగా, నిజం వైపు నిలవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎన్‌వీ రమణ మాట్లాడారు. ‘‘న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తులకు, వ్యవస్థకు సహకరించాలి. మనమంతా ఓ పెద్ద కుటుంబంలో సభ్యులం. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ఎవరూ మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top