భారతీయులకు దన్నుగా భారత్‌..!

Pm Narendra Modi inaugurates renovated Jallianwala Bagh memorial complex - Sakshi

కష్టాల్లో అండగా ఉంటుందన్న ప్రధాని మోదీ

నవీకరించిన జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్‌ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ప్రధాని

అమృత్‌సర్‌: ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా, సాయం చేసేందుకు యావద్భారతం ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. అఫ్గాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కుతగ్గమన్నారు. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్‌ను సుందరీకరించి దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన వీడీయోలైన్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ దేవీ శక్తి గురించి మాట్లాడారు.

ఆపరేషన్‌ దేవీ శక్తిలో భాగంగా పలువురు స్వదేశీయులను అఫ్గాన్‌ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ప్రజలతో పాటు పవిత్రమైన సిక్కు మత గ్రంధాలను కూడా వెనక్కు తెచ్చామని మోదీ తెలిపారు. గురు కృప(సిక్కు గురువుల ఆశీస్సులు)తో ఈ కష్టమైన కార్యాన్ని సమర్ధవంతంగా భారత్‌ నిర్వహిస్తోందన్నారు. కోవిడ్‌ కావచ్చు, అఫ్గాన్‌ సంక్షోభం కావచ్చు... భారతీయులకు కష్టం వస్తే భారత్‌ వెంటనే ఆదుకుంటుందనే సందేశమిచ్చారు. ఇటీవల కాలంలో మానవాళి ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను ఎదుర్కోవడంలో గురువుల బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. గురువులు చూపిన మార్గాన్ని అనుసరించి నూతన చట్టాలను తీసుకువచ్చామని పరోక్షంగా సీఏఏ గురించి ప్రస్తావించారు.

ఆత్మనిర్భరత్వం, ఆత్మ విశ్వాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు.   పునరుద్ధరించిన జలియన్‌ వాలాబాగ్‌ మెమోరియల్‌ సముదాయాన్ని ప్రారంభించిన  సందర్భంగా ఆనాటి ‘జలియన్‌వాలా మారణకాండ’లో వీరమరణం పొందిన వారి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సముదాయం అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. స్మారక సముదాయంలో ఉన్న ఉపయోగంలో లేని భవనాల్లో 4 మ్యూజియం గ్యాలరీలను కొత్తగా ఏర్పాటు చేసింది. నవీకరించిన సముదాయంలో జలియన్‌వాలా మారణకాండ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1919 సంవత్సరం ఏప్రిల్‌ 13వ తేదీన జలియన్‌వాలాలో సమావేశమైన వేలాది మందిపై బ్రిటిష్‌ సైనికులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వేయి మంది పౌరులు నేలకొరగ్గా, వందలాదిగా గాయాలపాలైన విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top