చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్‌ | Sakshi
Sakshi News home page

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్‌

Published Sun, Apr 9 2023 3:35 AM

PM Narendra Modi inaugurates Chennai airport new terminal building - Sakshi

చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్‌ టర్మినల్‌ భవంతి(ఫేజ్‌–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్‌పోర్ట్‌ నూతన టర్మినల్‌ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది.

తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు.

దీంతోపాటు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి.

వివేకానంద హౌజ్‌ను సందర్శించిన మోదీ
చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్‌ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్‌ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు.

Advertisement
Advertisement