
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.
ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.
ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది.