
భారత్–పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్
విశ్లేషణ
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్‌లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్‌లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు.
నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్‌లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు.
అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను.
తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!
అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి.
అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు.
మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.
1971ని తలపిస్తున్న మంతనాలు
ప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్‌కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు.
భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్‌త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి.
నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!
నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు.
ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన.
ప్రమాదకరంగా సోషల్ మీడియా!
ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.
దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.
ఐక్యంగా ముందుకు సాగాలి
ఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!
శశి శేఖర్
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు