భారత్‌.. ఏ దేశానికీ ముప్పు కాదు

Pm Modi Says Govt Efforts To Connect Pilgrimages Of Sikh Tradition Guru Tegh Bahadurs Anniversary - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఎర్రకోటలో తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ: భారత్‌ ఏ ఇతర దేశానికి, సమాజానికీ ఏనాడూ ముప్పుగా పరిణమించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌ అని తేల్చిచెప్పారు. సిక్కు గురువుల ఆలోచనలను మన దేశం అనుసరిస్తోందని తెలిపారు. తొమ్మిదో సిక్కు గురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్‌గంజ్‌ సాహిబ్‌ గురు తేగ్‌ బహదూర్‌ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మనదేశ గొప్ప సంస్కృతిని రక్షించేందుకు తేగ్‌ బహదూర్‌ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తెలియజేస్తోందన్నారు. అప్పట్లో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో గురు తేగ్‌ బహదూర్‌ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికిందన్నారు. తేగ్‌ బహదూర్‌ స్మారక నాణేన్ని, తపాళా బిళ్లను మోదీ విడుదల చేశారు.

దేశ ఐక్యత, సమగ్రతపై రాజీ వద్దు
దేశ సమగ్రత, ఐక్యతల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని ప్రధాని మోదీ అన్నారు. విధుల్లో భాగంగా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికీ ‘నేషన్‌ ఫస్ట్‌–ఇండియా ఫస్ట్‌’ అనే వైఖరినే అనుసరించాలని సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రజానుకూల విధానాలకే తప్ప, రాజకీయాలకు తావుండరాదన్నదే తన అభిమతమన్నారు. గురువారం 15వ సివిల్‌ సర్వీసెస్‌ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లను ‘అమృత్‌ కాల్‌’గా అభివర్ణించారు. ‘ఈ 25 ఏళ్లను యూనిట్‌గా తీసుకుని, ఒక విజన్‌తో ముందుకు సాగాలి.

దేశంలోని ప్రతి జిల్లా ఇదే ఆశయంతో ఉండాలి’అని ఆకాంక్షించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరిస్తూ మూడు లక్ష్యాలకు మనం కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ‘మొదటిది.. సామాన్య పౌరుడి జీవితాల్లో మార్పు తేవాలి. వారి జీవనం సులభతరం కావాలి. అదే సౌలభ్యాన్ని వారు అనుభవించాలి. రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు పొందగలగాలి. ఇదే మనందరి లక్ష్యం. దీనిని సాకారం చేయాలి. రెండోది..పెరుగుతున్న మన దేశం స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. అదే స్థాయిలో మనం కార్యక్రమాలు చేపట్టాలి మూడోది.. ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నా దేశ సమైక్యత, సమగ్రతలే మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండరాదు. స్థానిక నిర్ణయాలకు సైతం ఇదే ప్రామాణికం కావాలి’ అని మోదీ సూచించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top