భగత్ సింగ్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి | PM Modi pays tribute to Bhagat Singh, Rajguru and Sukhdev | Sakshi
Sakshi News home page

భగత్ సింగ్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి

Mar 23 2026 9:59 AM | Updated on Mar 23 2026 10:39 AM

PM Modi pays tribute to Bhagat Singh, Rajguru and Sukhdev

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరస్మరణీయ ముద్ర వేసిన విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను స్మరించుకుంటూ దేశం నేడు ‘షహీద్ దివస్’ (అమరవీరుల దినోత్సవం) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ ముగ్గురు వీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి నేటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

వారి త్యాగం వెలకట్టలేనిది: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ‘భారతమాత ముద్దుబిడ్డలైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నేడు దేశం సాష్టాంగ నమస్కారం చేస్తోంది. మాతృభూమి విముక్తి కోసం వారు చేసిన బలిదానం మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అతి చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యం ప్రశంసనీయం. బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి, తమ ప్రాణాల కంటే దేశమే మిన్న అని చాటిచెప్పిన ఆ వీరుల ఆశయాలు ఇప్పటికీ మనలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయి’ అని పేర్కొన్నారు.
 

షహీద్ దివస్ ప్రాముఖ్యత ఏమిటి?
ప్రతి ఏటా మార్చి 23ను భారతీయులు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో ఇదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్‌గురు,  సుఖ్‌దేవ్‌లను లాహోర్ జైలులో ఉరితీసింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ ముగ్గురి పాత్ర అసాధారణమైనది.

చరిత్రలో నిలిచిన ఆ వీరగాథ..
ఈ విప్లవకారుల పోరాటం వెనుక బలమైన కారణాలున్నాయి. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో బ్రిటిష్ పోలీసుల లాఠీఛార్జ్ వల్ల ప్రముఖ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణించారు. ఈ ఘటన భగత్ సింగ్ బృందాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీనికి ప్రతీకారంగా వారు బ్రిటిష్ అధికారి జాన్ సాండర్స్‌ను హతమార్చారు. అనంతరం 1929లో బ్రిటిష్ వారి నిరంకుశ చట్టాలకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఎవరినీ చంపడం తమ ఉద్దేశ్యం కాదని, బ్రిటిష్ పాలకులకు భారతీయుల గళం వినిపించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ పోరాట ఫలితంగానే 1931 మార్చి 23న వారు వీరమరణం పొందారు. వారి త్యాగాలను స్మరిస్తూ నేడు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: విమాన ప్రయాణికులకు ప్రభుత్వం షాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement