నేతాజీకి జాతి ఘన నివాళి | Sakshi
Sakshi News home page

నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Published Sun, Jan 23 2022 7:33 PM

PM Modi Inaugurates Hologram Statue Of Netaji Subhas Chandra Bose India Gate - Sakshi

న్యూఢిల్లీ: ఆజాద్‌ హిందు ఫౌజ్‌ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది.  స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్‌ దివస్‌ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్‌ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్‌ దగ్గర నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్‌ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు.  

కెన్‌ డూ.. విల్‌ డూ..
విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్‌ డూ (చేయగలము) విల్‌ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు.

ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు  సుభాష్‌ చంద్రబోస్‌ ఆప్డా ప్రబంధన్‌ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్‌ జనరల్‌ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు.  

ఆ భాగాల్ని అనువదించలేదు  
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడానికి  జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్‌ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్‌ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్‌ చంద్రబోస్‌ సోదరుడు శరత్‌ బోస్‌ మనవరాలు మాధురి బోస్‌ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్‌ పేర్కొందని గుర్తు చేశారు.  

దేశ, విదేశాల్లో..
బోస్‌ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్‌ స్వాతంత్య్ర సాధనలో బోస్‌ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్‌ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్‌ సీఎం మమత డిమాండ్‌ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్‌ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్‌ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్‌ ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement