
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్(సీసీఎస్)లోని అన్ని భవనాల నిర్మాణం 22 నెలల్లో పూర్తవుతుందని పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇవి పూర్తయితే ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల నడుస్తున్న శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి వాటిని 10 కొత్త భవనాల్లోకి తరలిస్తామన్నారు. సీసీఎస్‌లో భాగమైన మొదటి భవనం ‘కర్తవ్య భవన్’ను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కర్తవ్య పథ్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు.
కర్తవ్య భవన్–03 కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాజెక్టులోనిదే. ఇందులోని నిర్మాణంలో ఉన్న 1, 2 భవనాలు వచ్చే నెలలో పూర్తవుతాయి. సీసీఎస్–10 భవనం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. సీసీఎస్–6, 7 భవనాల నిర్మాణం 2026 అక్టోబర్ నాటికి రూపుదిద్దుకుంటాయి. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల నడుస్తున్న శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్‌లను కూలి్చవేసేందుకు రెండు నెలల్లో టెండర్లను ఆహ్వానిస్తామని మంత్రి ఖట్టర్ తెలిపారు.
ఈ భవనాల్లోని మంత్రిత్వ శాఖలను తాత్కాలికంగా కస్తూర్బా గాంధీ మార్గ్‌లోని నేతాజీ ప్యాలెస్‌కు తరలిస్తామన్నారు. ఇలా ఉండగా, యావత్ సెంట్రల్ విస్తా నుంచి నిర్మించే మెట్రో లైనును ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తామని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కటికితల శ్రీనివాస్ చెప్పారు. కొత్త మెట్రో లైను సీసీఎస్ భవనాలు, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మీదుగా వెళ్తుందన్నారు.