'నాకు, మోదీకి ఆ బాధ లేదు.. హ‌మ్మ‌య్య! అమిత్ షా న‌వ్వారు' | PM Modi and I do not have wife issue: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నాకు, మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేదు: రాహుల్ గాంధీ

Apr 17 2026 6:12 PM | Updated on Apr 17 2026 7:07 PM

PM Modi and I do not have wife issue: Rahul Gandhi

ఢిల్లీ: లోక్‌సభలో మూడు కీల‌క బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ నాయ‌కుడు రాహుల్ గాంధీ న‌వ్వులు పూయించారు. త‌న‌కు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేద‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించ‌డంతో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌, డీలిమిటేష‌న్, కేంద్ర పాలిత ప్రాంతాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుల‌పై చ‌ర్చ‌లో శుక్ర‌వారం ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర గురించి గొప్ప‌గా చెప్పారు.

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మహిళల నుంచే నేర్చుకుంటారని అన్నారు. దైనందిన జీవితంలో ప్ర‌తి విషయంలోనూ మ‌హిళ‌ల స‌హ‌కారం అవస‌రం ఉంటుంద‌ని వివ‌రించారు.  “మన జాతీయ భావన, దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర, చోదక శక్తి. మనమందరం, ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని తల్లులు, సోదరీమణులు, భార్యలైన మహిళల నుంచి ఎంతో ప్రభావితమయ్యాం, స్ఫూర్తి పొందాం, నేర్చుకున్నాం“ అంటూ మ‌హిళ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ సంద‌ర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన ఓ వ్యాఖ్యకు రాహుల్ గాంధీ కూడా స‌ర‌దాగానే స‌మాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లాగా తాను తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. "నిజానికి నాకు, ప్రధానమంత్రికి భార్యల‌ సమస్య లేదు. కాబట్టి మాకు అలాంటి సలహాలు అందవు. కానీ మాకు మా అమ్మలు, సోదరీమణులు ఉన్నారు" అని అన్నారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి.

నేను చేయ‌లేని ప‌ని ప్రియాంక చేసింది
గురువారం లోక్‌సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. "నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో సాధించడం చూశాను. అదే అమిత్ షా గారిని నవ్వించడం" అని రాహుల్ అన‌గానే సభికులందరూ పగలబడి నవ్వారు. 

చ‌ద‌వండి: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు క్రెడిట్ ప్ర‌తిప‌క్షాల‌కే

రాహుల్ వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం
కాగా, ఆప‌రేష‌న్ సిందూర్, బాల‌కోట్ వంటి అంశాల‌పై ప్ర‌ధాని మోదీ మ్యాజిక్ చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌తో లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం రేగింది. ప్ర‌ధాన‌మంత్రిని అవ‌మానించిన రాహుల్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఎన్డీఏ స‌భ్యులు డిమాండ్ చేశారు. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఇలాంటి మాట‌లు మాట్లాడ‌డం స‌రికాద‌ని అన్నారు. రాహుల్ గాంధీని స‌భ నుంచి బ‌హిష్క‌రించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement