
ఐక్యరాజ్యసమితి: ఎడారీకరణ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఈ నెల 14న నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ విధానంలో మోదీ హాజరై ప్రసంగిస్తారని ఐరాస వెల్లడించింది. ఎడారీకరణపై ఐరాస నిర్వహిస్తున్న పార్టీల సమాఖ్య (యూఎన్‌సీసీడీ సీఓపీ) 14వ సెషన్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. ఎడారీకరణ, భూ క్రమక్షయం అనే అంశాలపై ఆయన ప్రత్యేక సందేశం ఇస్తారని చెప్పింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ యూఎన్ సెక్రటరీ జనరల్ అమినా మొహ్మద్, ఎడారీకరణపై ఐరాస ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇబ్రహీం తైవా, ఏఎఫ్‌పీఏటీ కోఆర్డినేటర్ హిందౌ ఔమరౌ ఇబ్రహీంలు కూడా మాట్లాడతారని తెలిపింది. వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నట్లు ఐరాస తెలిపింది. మన సమాజాలకు భూమే పునాది అని ఐరాస మార్గదర్శక నివేదిక పేర్కొంది. పర్యావరణ ఆరోగ్యం, ఆకలి లేని సమాజం,, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యాలని.. వాటిని 2030 సుస్థిరాభివృద్ధి అజెండాగా భావిస్తున్నట్లు తెలిపింది. ఎడారీకరణపై ఐరాస పార్టీల కాన్ఫరెన్స్ 14వ సెషన్‌ను ప్రధాని మోదీ 2019 సెప్టెంబర్‌లో ఢిల్లీలో ప్రారంభించారు.