మొక్కు తీరకుండానే మృత్యుఒడికి

Pilgrims Dead In Karnataka Road Accident Chunchanura Village - Sakshi

చెట్టును ఢీకొన్న బొలెరో వాహనం 

ఆరుగురు భక్తులు మృతి, 16 మందికి గాయాలు  

బెళగావి జిల్లాలో ఘోర సంఘటన

రేణుకా యల్లమ్మా.. నీ దర్శనానికి వస్తున్నామమ్మా అని స్మరిస్తూ పాదయాత్రగా బయల్దేరారు. కానీ మధ్యలో మృత్యుశకటంలా బొలెరో వాహనం వచ్చింది. త్వరగా వెళ్లొచ్చు కదా అని అందులో బయల్దేరారు.  విధి చిన్న చూపు చూసింది. యల్లమ్మ దర్శనానికి నోచుకోలేకపోయారు. బొలెరో ప్రమాదంలో ఆరు మంది భక్తులు అసువులు బాశారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే. కుటుంబీకుల శోకాలతో ఆ ప్రాంతం విషాద సంద్రమైంది.  

సాక్షి, బెంగళూరు:  బెళగావి జిల్లాలో సవదత్తి రేణుకా యల్లమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం తెల్లవారుజామున రామదుర్గ తాలూకా హులకుంద గ్రామంలో ఈ దుర్ఘటన జరగ్గా, ఆరుమంది మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.  
బొలెరో ఎక్కిన కొంత సేపటికే  
- రామదుర్గ తాలూకా హులకుందకు చెందిన కొందరు భక్తులు తెల్లవారుజామున నడుచుకుంటూ యల్లమ్మ దేవి దేవస్థానికి బయల్దేరారు.  
-  మార్గమధ్యలో బొలేరో గూడ్స్‌ వాహనం డ్రైవర్‌ వాహనం ఆపి సవదత్తిలో వదులుతానని చెప్పడంతో అందరూ ఎక్కారు.  
- మొత్తం వాహనంలో 23 మందిని ఎక్కించుకుని డ్రైవర్‌ బయలుదేరాడు. ఐదు నిమిషాలు ప్రయాణించిందో లేదో రామదుర్గ తాలూకా చుంచనూర వద్ద విఠల్‌ రుక్మిణి గుడి వద్ద పెద్ద చెట్టుకు గుద్దుకుంది.  
- వాహనం ధ్వంసం కాగా అందరూ తలోదిక్కుకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో మరొకరు మరణించారు.  
- హనుమవ్వ మెగాడి (25), దీపా (31), సవిత (12), సుప్రిత (11), మారుతి (43), ఇంద్రవ్వ (28)లను మృతులుగా గుర్తించారు.  
- మరో 16 మంది గాయపడగా వారిని గోకాక్, ఇతరత్రా ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  

మితిమీరిన వేగమే కారణం 
అతి వేగం వల్ల డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమైంది. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో తీసుకుని వెళ్తున్న పెద్ద పెద్ద ఇనుప పైపుల వల్ల ప్రమాద తీవ్ర ఇంకా పెరిగింది. ఇదే మార్గంలో దేవస్థానానికి వెళుతున్న ఇతర వాహనాల ప్రయాణికులు, గ్రామస్తులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కడకోళ పోలీసులు అంబులెన్స్‌ ద్వారా గాయపడిన వారిని  ఆస్పత్రులకు తరలించారు. సంఘటన స్థలానికి ఎస్పీ  సంజీవ పాటిల్‌ వచ్చి పరిశీలించారు. ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాకుల చెరో రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారి చికిత్సకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top