ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.
అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh
— Sun News (@sunnewstamil) March 21, 2026


