కోళీకోడ్‌ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్‌

Pending Fine at Dubai Airport Saved Kerala Man From Kozhikode Accident - Sakshi

తిరువనంతపురం‌: దుబాయ్‌ నుంచి వస్తోన్న ఎయిర్‌ ఇండియా విమానం కేరళ కోళీకోడ్‌లో ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి దుబాయ్‌ అధికారులకు కృత‍జ్ఞతలు తెలుపుతున్నాడు. తన ప్రాణం కాపాడిన దేవుళ్లంటూ ప్రశంసిస్తున్నాడు. ఆ వివరాలు.. టి. నౌఫాల్‌ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఉద్యోగం  పొగొట్టుకున్నాడు. దాంతో ఇండియాకు వెళ్లాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురయిన విమానంలోనే అతడు రావాల్సి ఉండింది. అయితే ఆఖరి నిమిషంలో అతడి ప్రయాణం వాయిదా పడింది. దుబాయ్‌ విమానాశ్రయంలో అతడి మీద ఓ జరిమానా పెండింగ్‌లో ఉంది. దాంతో సిబ్బంది అతడిని ఇండియాకు వెళ్లడానికి అనుమతించలేదు. అప్పుడు బాధపడినా.. ప్రమాదం గురించి తెలిసి తన అదృష్టానికి మురిసిపోతున్నాడు నౌఫాల్‌.(కోళీకోడ్ ప్ర‌మాదం : అచ్చం అలానే జ‌రిగింది)

ఈ సందర్భంగా నౌఫాల్‌ మాట్లాడుతూ.. ‘ఇంటికి వెళ్లబోతున్నాను అని చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటి దగ్గర అందరికి చెప్పాను. ఎయిర్‌ పోర్టుకు వెళ్లాను. అయితే అధికారులు నా వివరాలు పరిశీలించి.. నేను ఇండియా వెళ్లడానికి వీళ్లేదన్నారు. నా మీద ఓ ఫైన్‌ పెండింగ్‌ ఉందని తెలిపారు. దాంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ అధికారిని ఎంతో బతిమిలాడాను. కానీ వారు నా అభ్యర్థనను పట్టించకోలేదు. దాంతో ఎయిర్‌పోర్టు నుంచి నా రూమ్‌కు వెళ్లాను. ఇంటికి ఫోన్‌ చేసి రావడం లేదని చెప్పాను. ఆ తర్వాత నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాను. కానీ ఎప్పుడైతే విమాన ప్రమాదం గురించి విన్నానో నాలో అనేక రకాల భావాలు వెల్లడయ్యాయి. అంతసేపు ఇంటికి వెళ్లలేకపోయినందుకు బాధపడ్డ నేను.. ఆ క్షణం ఆ విమానంలో లేకపోవడం నిజంగా నా అదృష్టం అంటూ ఆనందానికి లోనయ్యాను. మరోవైపు ప్రమాదానికి గురయిన వారిని తల్చుకుంటే చాలా బాధ కలిగింది. ఏది ఏమైనా జరిమానా నా ప్రాణం కాపాడింది’ అంటూ చెప్పుకొచ్చాడు నౌఫాల్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top