ముగిసిన పార్లమెంట్‌

Parliament Monsoon session cut short by 7 days - Sakshi

వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

8 రోజుల ముందే ముగింపు

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్‌ పోర్ట్‌ అథారిటీస్‌ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభను బుధవారం సాయంత్రం స్పీకర్‌ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్‌ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

విపక్షాల మౌన నిరసన
వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్‌ ఫార్మర్స్‌’, ‘సేవ్‌ వర్కర్స్‌’, ‘సేవ్‌ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు.

కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం
కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు.

‘ఇవి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top