
కీలక వ్యవస్థలను దెబ్బ తీశాం: కేంద్రం
సైనిక స్థావరాలు, రాడార్ డిఫెన్స్ ధ్వంసం
పశ్చిమ సరిహద్దు పొడవునా పాక్ దాడులు
పౌర, సైనిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంది
36 ప్రాంతాలపై 400 పై చిలుకు టర్కీ డ్రోన్లు
వాటన్నింటినీ సైన్యం దీటుగా తిప్పికొట్టింది
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక వెల్లడి
న్యూఢిల్లీ: భారత నగరాలు, పౌర ఆవాసాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పశ్చిమ సరిహద్దుల పొడవునా గురువారం పాక్ మతిలేని దాడులకు దిగిందని కేంద్రం వెల్లడించింది. వాటిని మన బలగాలు పూర్తిగా తిప్పికొట్టినట్టు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ తెలిపారు. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీతో కలిసి వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘‘భారత సైనిక వ్యవస్థలే లక్ష్యంగా గురువారం రాత్రి పాక్ సైన్యం మన గగనతలంపై పదేపదే దాడులు చేసింది. లేహ్ నుంచి సర్‌క్రీక్ దాకా 36 ప్రాంతాలపై 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించింది. బహుశా నిఘా సమాచార సేకరణ, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పరీక్షించి చూసుకోవడమే ఈ డ్రోన్ చొరబాట్ల లక్ష్యం. వాటిలో చాలావరకు ఎక్కడివక్కడ కూల్చేశాం. అవి తుర్కియే డ్రోన్లని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా అంచనాకు వచ్చాం. తర్వాత పాక్ తేలికపాటి యుద్ధ విమానం భటిండా సైనిక స్థావరంపై దాడికి యతి్నంచిగా అడ్డుకుని తిప్పికొట్టాం.
అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుకు, నియంత్రణ రేఖకు ఆవలి నుంచి పాక్ భారీగా కాల్పులకు కూడా తెగబడింది. జమ్మూ కశ్మీర్‌లో సుందర్, ఉరి, పూంఛ్, మేంధర్, రాజౌరీ, అఖూ్నర్, ఉధంపూర్ ప్రాంతాల్లో భారీ మోర్టార్లు, గన్లతో దాడులు చేసింది. వీటిలో కొందరు సైనికులు మరణించగా పలువురు గాయపడ్డారు. మన ప్రతీకార దాడుల్లో పాక్ తీవ్ర నష్టం చవిచూసింది. 4 పాక్ సైనిక స్థావరాలపై సైన్యం డ్రోన్ దాడులు జరిపింది. వారి ఏడీ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశాం’’అని వారు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్–400 వ్యవస్థతో పాటు బరాక్–8, ఆకాశ్ మిసైళ్లు తదితరాలను వాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మతం రంగు పులిమే యత్నం
గురుద్వారాపై దాడుల ప్రచారంపై మిస్రీ
భారత్ తన సొంత ప్రార్థనా స్థలాలపైనే దాడులు చేసుకుందన్న పాక్ ప్రచారంపై మిస్రీ నిప్పులు చెరిగారు. ‘‘పాక్ ద్వంద్వ వైఖరికి, తప్పుడు ప్రచారానికి ఇది పరాకాష్ట. చివరికి దాడులకు మతం రంగు పులిమే స్థాయికి దిగజారింది’’అంటూ దుయ్యబట్టారు. ‘‘పాక్ సైన్యం అమృత్‌సర్, పూంఛ్ సమీపంలో నన్కానా సాహిబ్ తదితర గురుద్వారాలు, ఆలయాలపై దాడులకు పాల్పడి పాక్షికంగా ధ్వంసం చేసింది.
ఆ నెపాన్ని మనపై వేస్తూ దు్రష్పచారానికి దిగుతోంది. భారత్ తన సొంత ప్రాంతాలపైనే దాడులు చేసుకుందని ఆరోపించే స్థాయికి దిగజారడం పాక్‌కు మాత్రమే సాధ్యం. సొంత ప్రాంతాలపై దాడులు చేసుకుని నెపాన్ని భారత్‌పైకి నెట్టేవారికి ఇలాంటి కుయుక్తులే తోస్తాయి’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘పాక్ కాల్పుల్లో పూంఛ్‌లోని ఓ క్రైస్తవ మిషనరీ స్కూలు వెనక భాగం ధ్వంసమైంది. ఇద్దరు చిన్నారులు మరణించారు. కాల్పుల నేపథ్యంలో స్థానిక క్రైస్తవ నన్స్ తదితరులు బంకర్లలో తలదాచుకుంటున్నారు’’అని చెప్పారు.

పౌర విమానాలను కవచం చేసుకునే కుట్ర
భారత్ ప్రతిదాడులు చేయకుండా అడ్డుకునేందుకు పాక్ తన సొంత పౌర విమానాలనే కవచంగా చేసుకునే నైచ్యానికి దిగిందని కల్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక తెలిపారు. ‘‘పాక్ ఏకపక్ష డ్రోన్ దాడులకు ప్రతిగా వైమానిక దాడులతో భారత్ దీటుగా స్పందిస్తుందని, అది పౌర విమానాలకు తీవ్ర ముప్పని తెలిసి కూడా తమ గగనతలాన్ని మూసేయలేదు. భారత్ సరిహద్దుల వెంబడి తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది.
పాక్‌లో మాత్రం లాహోర్, కరాచీ తదితర నగరాల నడుమ దేశీయ విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పౌర విమానాలు కూడా పాక్ గగనతలంపై సరిహద్దులకు అతి సమీపంలో ఎగురుతూనే ఉన్నాయి’’అని వివరించారు. ఇందుకు సంబంధించి ఫ్లైట్‌రాడార్24 డేటాను మీడియా ముందుంచారు. ‘‘అయినా మన వైమానిక దళం అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. పౌర విమానాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లని రీతిలో అత్యంత కచ్చితత్వంతో పాక్‌పై ప్రతి దాడులు నిర్వహించింది’’అని తెలిపారు.