పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే

Padma Shri awardee who arranged last rites of unclaimed bodies lies bed-ridden - Sakshi

అయోధ్య: 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.. అందరితో ఆప్యాయంగా ‘షరీఫ్‌ చాచా’ అని పిలిపించుకున్నారు. కేంద్రం 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కనీసం పింఛను కూడా ఇవ్వకపోవడంతో కటిక పేదరికంతో వైద్యం కూడా చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యారు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్‌కు చెందిన మొహమ్మద్‌ షరీఫ్‌(83).

అనాథలకు షరీఫ్‌ అందించిన సేవలకుగాను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం అందిందని ఆయన కుమారుడు షగీర్‌ తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆయనకు ఆ అవార్డు అందలేదన్నారు. పద్మశ్రీకి తన తండ్రి పేరును సిఫారసు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్‌ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు షగీర్‌ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు రూ.7వేల వేతనం మాత్రం వస్తుందనీ, అది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని షగీర్‌ తెలిపారు. పేదరికం కారణంగా తన తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top