ఆక్సిజన్‌ కొరత: ఢిల్లీలో మరో 20 మంది కరోనా రోగులు మృతి

Oxygen Shortage Corona Patients Deceased In Jaipur Golden Hospital Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో మృత్యుఘోష ఆగడం లేదు. శనివారం జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న మరో 20 మంది రోగులు ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. మరో అరగంటపాటే ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని గోల్డెన్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్నొన్నారు. మరో 200 మందికి పైగా కోవిడ్‌ రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆక్సిజన్‌ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్‌ ఆస్పత్రిలో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను సరోజ్‌ ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేస్తున్నాయి. 

అదే విధంగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ నిల్వల కొరత ఏర్పడింది. బాత్రా ఆస్పత్రికి డిమాండ్‌కు తగ్గట్టు ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదు. 8వేల లీటర్ల ఆక్సిజన్‌ అవసరం కాగా  కేవలం 500 లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే వస్తుండటంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాత్రా ఆస్పత్రిలో 350 మంది రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌పైనే కోవిడ్‌ రోగులకు చికిత్స ఆధారపడి ఉందని బాత్రా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ అందకపోతే కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్‌’: 25 మంది మృతి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top