ఒమిక్రాన్‌ ముప్పు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Omicron: Night curfew in Karnataka For 10 days From December 28, Details Inside - Sakshi

సాక్షి, బెంగళూరు: ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేగంగా విజృంభిస్తోంది. దీనికి తోడు మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో  కోవిడ్‌ ముప్పును అంచనా వేస్తున్న అన్ని రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధించగా..  తాజాగా ఆ జాబితాలోకి కర్ణాటక చేరింది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  డిసెంబర్‌ 28 నుంచి 10 రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ వెల్లడించారు.

కర్ణాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ  ఉంటుందని, ఆ సమయంలో సెక్షన్‌ 144 అమల్లో ఉంటుందని  తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి: ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా

ప్రజలందరూ మాస్కులు ధరించాలని, నైట్ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం న్యూ ఇయర్‌ వేడుకలను నిషేదించిన విషయం తెలిసిందే. పార్టీలు చేసుకోవడం, డీజేలు పెట్టడం, జనాలు గుంపులు గుంపులుగా తిరగడంపై పూర్తిగా నిషేదం విధించింది. అలాగే హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లో 50 శాతం సీటింగ్‌ సామర్ధ్యంతో నడుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 422 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 31 మందికి ఒమిక్రాన్‌ సోకగా .. వారిలో 15 మంది కోలుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top