బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సీఎం.. హర్‌ ఏక్‌బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ఎన్నికలకు: కేసీఆర్‌

Odisha Ex CM Some Leaders Joined BRS Party KCR Welcomed - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు భారత్‌ రాష్ట్ర సమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో ఇతర రాష్ట్రాల నుంచి చేరికలు మొదలయ్యాయి. 

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌(79) బీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గిరిధర్‌ గమాంగ్‌కు కండువా కప్పి ఆహ్వానించారు కేసీఆర్‌. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం. గిరిధర్‌తో పాటు మరికొందరు ఒడిశా నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో మాజీ ఎంపీ జయరామ్‌ పంఘి కూడా ఉన్నారు. ఈయన కూడా కిందటి ఏడాదే బీజేపీని వీడారు. ఈ సందర్భంలో కేసీఆర్‌ మాట్లాడుతూ..

‘అమెరికా, చైనా కంటే మన దేశంలోనే సంపద ఎక్కువగా ఉంది. కానీ ఆ రెండు దేశాలు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయి?. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించాం?.  దేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరూ అందడం లేదు. మంచి నీరు కూడా ఇవ్వలేకపోతున్నాం. అందుకే.. దేశ భవిష్యత్‌ కోసమే బీఆర్‌ఎస్‌. ఈ మహాసంగ్రామంలో మనతో గవాంగ్‌ కలిసి వస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఒడిషాలో అన్ని నదులు ఉన్న తాగు నీరు అందడం లేదు. మహారాష్ట్రలో సంపద లేదా?. జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగిన వాళ్లు గెలిచి ఏం చేస్తున్నారు?. కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది. అసలు దేశంలో రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. రైతులు కూడా చట్ట సభల్లోకి రావాలి. అందుకే హర్‌ ఏక్‌బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నాం అని పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు. వలస వెళ్తున్న వాళ్లు తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు.

గిరిధర్‌ గమాంగ్‌ నేపథ్యం..
రాయ్‌ఘడ్‌ జిల్లాలో పుట్టి పెరిగిన గిరిధర్‌ గమాంగ్‌.. కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కోరాపూట్‌ లోక్‌సభ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన గిరిధర్‌.. 1977 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతేకాదు.. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 దాకా ఆయన ఒడిశాకు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోవడంతో.. అక్కడ మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆపై కాంగ్రెస్‌ నేతగా ఉన్న ఆయన.. ఆ తర్వాత 2015లో బీజేపీలోకి చేరారు. ఈ నెల మొదట్లో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top