
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ లాంటి ప్రపంచ అగ్రనేతలతో వ్యక్తిగత స్నేహం ఉందని, అందుకే ప్రధానిమోదీకి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ఉందని నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం భారత్‌పై భారీ వాణిజ్య సుంకాలను విధించినప్పటికీ, భారత్-అమెరికా సంబంధాలలో ఎటువంటి విఘాతం ఏర్పడబోదని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల స్నేహాన్ని ఉదహరిస్తూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన తొలి బహిరంగా సమావేశంలో పేర్కొన్నారు.
భారతదేశంపై అమెరికా 50 శాతం సుంకం విధించినప్పటికీ ట్రంప్ .. మోదీ తనకు గొప్ప స్నేహితుడని చెబుతూనే ఉన్నారని, ట్రంప్ ఎన్నడూ తాను మోదీని వ్యతిరేకిస్తున్నానని చెప్పలేదని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మోదీకి ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ మంచి స్నేహితులేనని అందుకే ఆయన(మోదీ) అసాధ్యాలను సుసాధ్యం చేయగలరన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలుగు పుస్తకాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. సందర్భంగా ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
సమస్యల పట్ల మోదీ వైఖరిని చాలా లోతుగా ఉంటుందని, ప్రజల మనోభావాలను విస్మరించని నేత ప్రధాని మోదీ అని, ఆయన ప్రసంగాలు ఎంతో అర్థవంతమైనవని అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదగాలనే మన ఆకాంక్ష ఆధిపత్యం ద్వారా సాధ్యంకాదని, ప్రపంచ సంక్షేమం అనే ఆలోచన ద్వారా సమకూరుతుందని భారతదేశం నిరూపించిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ మన అతిపెద్ద సమస్య..ఇతర దేశాలపై ఆధారపడటమేనన్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికత, లక్ష్యాన్ని ప్రధాని మోదీ కలిగివుండి, ఆ దిశగా దేశాన్ని నడిపిస్తున్నారన్నారు.