
జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం
దిగ్విజయంగా కక్ష్యలోకి చేరిన ఇస్రో–నాసా ఉమ్మడి ఉపగ్రహం
భూమి ఉపరితలం పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం
భూమిని స్కాన్ చేసే పనిలో అప్పుడే నిమగ్నం
హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్స్
రూ.11,200 కోట్లతో రూపొందించిన ఈ శాటిలైట్ పదేళ్ల పాటు సేవలు
ఇక ఆకాశమే హద్దుగా ప్రయోగాలు: ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ వెల్లడి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఉమ్మడి ఉపగ్రహం నైసార్ జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 నిప్పులు చిమ్ముతూ బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణిత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత భూమిని స్కాన్ చేయడం ప్రారంభించడంతో ప్రయోగం విజయవంతమైంది. భూమి ఉపరితలం లోతు గా పరిశీలన.. వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇస్రో, నాసాలు మొట్ట మొదటిసారిగా సంయుక్తంగా 2,392 కేజీల బరువు కలిగిన నైసార్ (నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్) ఉపగ్రహాన్ని రూపొందించాయి.
జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎప్16) ఉపగ్రహ వాహక నౌక ద్వారా భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య సమకాలిక కక్ష్యలో నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇది ప్రత్యేకంగా భూమి ఉపరితల పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నాసాది ఎల్–బ్యాండ్, ఇస్రోది ఎస్–బ్యాండ్) భూమిని అత్యంత దగ్గరగా పరిశీలించే ఉపగ్రహం.
దీనికి 12 మీటర్ల అన్‌ఫర్లబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటెన్నాను అమర్చారు. ఈ ఉపగ్రహం తొలిసారిగా స్వీప్‌సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్లు అ«ధిక స్పేషియల్ రిజల్యూషన్‌తో భూమిని పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం భూగోళాన్ని మొత్తం స్కాన్ చేసి 12 రోజుల వ్యవధిలో అన్ని వాతావరణ పరిస్థితుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా డేటాను అందిస్తుంది. భూమి ఉపరితలంలో నేల వైకల్యం, మంచు పలకాల కదలిక, వృక్ష సంపద, డైనమిక్స్ వంటి చిన్న మార్పులను కూడా గుర్తిస్తుంది. సముద్రపు మంచు వర్గీకరణ, ఓడల గుర్తింపు, తీర ప్రాంత పర్యవేక్షణ, తుపాన్ లక్షణం, నేల తేమలో మార్పులు, ఉపరితల నీటి వనరుల మ్యాపింగ్, పర్యవేక్షణతో పాటు విపత్తుల సమయంలో హెచ్చరికలకు సంబం«ధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. రూ.11,200 కోట్లతో రూపొందించిన ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.
ప్రయోగంలో అన్ని దశలు అద్భుతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్16 ప్రయోగాన్ని నిర్వహించారు. ఎరుపు, నారింజ రంగుతో నిప్పులు చిమ్ముతూ నింగివైపునకు అత్యంత వేగంగా దూసుకెళ్లింది. మూడు దశల్లో ప్రయోగించిన రాకెట్‌లో అన్ని దశలు అద్భుతంగా పని చేయడంతో 18.40 నిమిషాలకు కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరు సమీపంలో హాసన్‌లో ఉన్న గ్రౌండ్‌స్టేషన్‌కు సిగ్నల్స్ అందడంతో ఉపగ్రహం చక్కగా పని చేస్తోందని వారు ప్రకటించారు. ఇది షార్ నుంచి 102వ ప్రయోగం. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు.
ప్రయోగం జరిగింది ఇలా..
⇒ 51.70 మీటర్లు పొడవున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 రాకెట్ 420.5 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది.
⇒ నాలుగు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 40 టన్నుల ద్రవ ఇంధనం.. స్ట్రాపాన్ బూస్టర్లకు మధ్యలోని కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనాలను (మొత్తం 299 టన్నుల ద్రవ, ఘన ఇంధనాలు) మిళితం చేసి 152 సెకన్లలో మొదటి దశ పూర్తి చేశారు.
⇒ రాకెట్ శిఖర భాగంలోని ఉప గ్రహానికి అమర్చిన హీట్ షీల్డ్స్ 171.8 సెకన్లకు మొదటి – రెండో దశకు మధ్యలోనే విజయవంతంగా విడిపోయాయి.
⇒ రెండో దశను 294.1 సెకన్లకు పూర్తి చేశారు.
⇒ ఆ తర్వాత అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,100 సెకన్లకు మూడో దశను కటాఫ్ చేశారు.
⇒ అనంతరం 1,120 సెకన్లకు (18.40 నిమిషాలకు) 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.
⇒ అక్కడి నుంచి ఉపగ్రహాన్ని బెంగళూరుకు సమీపంలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తన ఆధీనంలోకి తీసుకుని ఉపగ్రహ పనితీరును పర్యవేక్షించడం ప్రారంభించింది. ఉపగ్రహం సంతృప్తికరంగా ఉందని ప్రకటించారు.
ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇక ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. బుధవారం సాయంత్రం నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మే నెల 18న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం అపజయం కొంత కుంగదీసినా, ఈ ప్రయోగ విజయంతో మరిన్ని ప్రయోగాలను విజయవంతం చేయగలమనే నమ్మకం వచి్చందన్నారు. ఈ ప్రయోగం తనకు తొలి విజయమని, ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని చెప్పారు. ఇస్రో–నాసా మధ్య కుదిరిన ఒప్పందంతోనే ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మొట్టమొదటిసారి చేసిన ప్రయోగం విజయంతం కావడం ఆనందంగా ఉందన్నారు. నాసాతో మరిన్ని ఒప్పందాలు చేసుకుని రాబోయే రోజుల్లో మరో మూడు ప్రయోగాలను నిర్వహించేందుకు నాసా–ఇస్రో సన్నద్దమవుతున్నాయని తెలిపారు. ఇస్రోకు వాణిజ్య సంస్థగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను అప్పగించడంతో ఈ ఏడాది ప్రయివేట్‌గా పీఎస్‌ఎల్‌వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇస్రో నిర్ణయించిన షెడ్యూల్‌లో నిసార్‌తో కలిపి ఏడు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా వాణిజ్యపరంగా బ్లూబర్డ్–6 అనే ఉపగ్రహ ప్రయోగం వుంటుందన్నారు. ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ ఎన్1 రాకెట్ ద్వారా టీడీఎస్–1 అనే ఉపగ్రహాన్ని, హెచ్‌ఎల్‌వీఎం (గగన్‌యాన్–1) ద్వారా అన్ క్రూయిడ్ అర్బిటల్ టెస్ట్ పైలట్–1, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్17 ద్వారా ఐడీఆర్‌ఎస్‌ఎస్–1 అనే ఉపగ్రహాన్ని, గగన్‌యాన్ టీవీ–డీ2 ద్వారా టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–2 అనే ప్రయోగాత్మక ప్రయోగంతో పాటు పీఎస్‌ఎల్‌వీ సీ62 ద్వారా ఓషన్‌శాట్–3జీ అనే ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు.
అనంతరం 2026లో వరుసగా గగన్‌యాన్–2, గగన్‌యాన్–3 ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకున్నామని, చంద్రయాన్–4 ప్రయోగానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా, నిసార్ ప్రయోగాన్ని ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇస్రో మాజీ చైర్మన్లు డాక్టర్ కే రాధాకష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్‌లు మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని గ్యాలరీ నుంచి వీక్షించారు.
ఇస్రో సహకారం మరువలేనిది
నిసార్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్16 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తీరు ఆమోఘం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. నాసా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, జేపీఎస్ ఇంజినీర్ల పట్ల చూపించిన సహకారం మరువలేనిది. నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని (నిసార్) ఇరుదేశాలకు చెందిన ఇంజినీర్లు, నాసా శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేయడం ఆనందంగా ఉంది. ఇస్రో చూపించిన అభిమానం, సహకారంతో భవిష్యత్తులో మరో రెండు మూడు ప్రయోగాలు చేయడానికి మేము ముందుకొస్తున్నాం. ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. – నాసా మహిళా శాస్త్రవేత్త