‘ఉచితాల’పై లోతైన అధ్యయనం జరగాలి

New Delhi: Supreme Court Puts Off Formation Of Expert Panel On Freebies By Political Parties - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బాధ్యతను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. నాలుగు వారాల తర్వాత విచారణ ప్రారంభించాలని ధ్రర్మసనానికి సూచించింది. ఉచిత హామీలను అడ్డుకోవాలని సీనియన్‌ అడ్వొకేట్‌ అశ్వినీ కుమార్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఉచితాలపై లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలో కొన్ని ప్రాథమిక అంశాలపై చర్చ జరగాలని పేర్కొంది. ఎస్‌.సుబ్రమణియం బాలాజీ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం, ఇతరుల కేసులో 2013లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనలు వినిపిస్తున్నాయని వెల్లడించింది. ఉచిత హామీల విషయంలో సంక్లిష్టతలను, ద్విసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో పెట్టుకొని వ్యాజ్యాలపై విచారణ బాధ్యతను త్రిసభ్య ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతున్నాయంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారని గుర్తుచేసింది. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లేఅంతిమ న్యాయ నిర్ణేతలు. ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి అధికారంలోకి రావాలో ఓటర్లే నిర్ణయిస్తారు. పదవీ కాలం ముగిసిన తర్వాత సదరు పార్టీ లేదా అభ్యర్థి పనితీరు ఎలా ఉందో ఓటర్లే నిర్ణయించుకొని, తదుపరి ఎన్నికల్లో తీర్పు చెప్తారు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top