గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. | New Biweekly Express Train Between Secunderabad And Goa | Sakshi
Sakshi News home page

గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్‌న్యూస్..

Jul 6 2024 5:33 PM | Updated on Jul 6 2024 5:44 PM

New Biweekly Express Train Between Secunderabad And Goa

సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఈ రైలు గోవా బయలుదేనుంది. గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్‌కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.

ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.

మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.

ఈ నిర్ణయంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement