పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ

Navjot Singh Sidhu appointed Punjab Congress president - Sakshi

సీఎం అమరీందర్‌ వ్యతిరేకతను పట్టించుకోని అధిష్టానం

న్యూఢిల్లీ: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొని ఉన్న సమయంలో పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పీసీసీ చీఫ్‌గా సిద్దూని నియమించిన సోనియా.. మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు.

వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్‌ సింగ్‌ గిల్జియాన్, సుఖ్వీందర్‌ సింగ్‌ డానీ, పవన్‌ గోయెల్, కుల్జీత్‌ సింగ్‌ నాగ్రాలను వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. ఒకే పార్టీలో కీలక నేతలుగా ఉన్న అమరీందర్‌ సింగ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బహిరంగంగానే పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్‌ కూడా వారిద్దరి మద్దతుదారులతో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. వారిద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నించింది.

‘పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, తక్షణమే అమల్లోకి వచ్చేలా, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూని నియమిస్తున్నాం’ అని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న సునీల్‌ జాఖడ్‌ సేవలను ఈ ప్రకటనలో పార్టీ కొనియాడింది. 2017లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత క్రమంగా, పార్టీలో పట్టు సాధించారు. పీసీసీ చీఫ్‌ నియామకం విషయంలో సీఎం అమరీందర్‌ సింగ్‌ వ్యతిరేకతను కాదని, సిద్ధూ వైపే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేస్తాయని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సిద్ధూ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటుందని, ఎన్నికల ప్రచారంలో సిద్ధూ సేవలు అవసరమని సోనియాగాంధీ తదితర సీనియర్‌ నాయకులు విశ్వసించారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా సిద్ధూ వైపే మొగ్గు చూపారని వెల్లడించాయి.

అమరిందర్‌ సింగ్‌తో సయోధ్య, ఒకవేళ అది కుదరని పక్షంలో ఆయన వర్గీయుల వ్యతిరేకతను తట్టుకుని పార్టీని ఏకం చేయడం, పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేయడం నూతనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ముందున్న ప్రధాన సవాళ్లు. తనపై చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తూ, బహిరం గంగా క్షమాపణలు కోరితే తప్ప సిద్ధూని కలిసే ప్రసక్తే లేదని ఇటీవల ఢిల్లీలో పార్టీ చీఫ్‌ సోనియాతో సీఎం అమరీందర్‌ చెప్పారని సమాచారం. సీనియర్‌ నేతల మధ్య విబేధాలు తొలగనట్లయితే, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అమరీందర్‌ ప్రభుత్వంలో మంత్రిగా సిద్ధూ ఉన్నప్పటి నుంచే వారి మధ్య విబేధాలు ఉన్నాయి. అమరీందర్‌ వ్యతిరేకతను పట్టించుకోకుండా, అయన మంత్రివర్గంలో ఉన్న సిద్ధూ పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం, పాక్‌ ఆర్మీ చీఫ్‌ బాజ్వాను కౌగిలించుకోవడం.. మొదలైనవి ఇరువురి మధ్య విబేధాలు తీవ్రమవడానికి కారణమయ్యాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top