breaking news
PCC presidents appoint
-
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొని ఉన్న సమయంలో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పీసీసీ చీఫ్‌గా సిద్దూని నియమించిన సోనియా.. మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్ సింగ్ గిల్జియాన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్, కుల్జీత్ సింగ్ నాగ్రాలను వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. ఒకే పార్టీలో కీలక నేతలుగా ఉన్న అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ కూడా వారిద్దరి మద్దతుదారులతో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. వారిద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నించింది. ‘పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తక్షణమే అమల్లోకి వచ్చేలా, నవజ్యోత్ సింగ్ సిద్ధూని నియమిస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న సునీల్ జాఖడ్ సేవలను ఈ ప్రకటనలో పార్టీ కొనియాడింది. 2017లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత క్రమంగా, పార్టీలో పట్టు సాధించారు. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకతను కాదని, సిద్ధూ వైపే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేస్తాయని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సిద్ధూ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటుందని, ఎన్నికల ప్రచారంలో సిద్ధూ సేవలు అవసరమని సోనియాగాంధీ తదితర సీనియర్ నాయకులు విశ్వసించారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా సిద్ధూ వైపే మొగ్గు చూపారని వెల్లడించాయి. అమరిందర్ సింగ్‌తో సయోధ్య, ఒకవేళ అది కుదరని పక్షంలో ఆయన వర్గీయుల వ్యతిరేకతను తట్టుకుని పార్టీని ఏకం చేయడం, పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేయడం నూతనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముందున్న ప్రధాన సవాళ్లు. తనపై చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తూ, బహిరం గంగా క్షమాపణలు కోరితే తప్ప సిద్ధూని కలిసే ప్రసక్తే లేదని ఇటీవల ఢిల్లీలో పార్టీ చీఫ్ సోనియాతో సీఎం అమరీందర్ చెప్పారని సమాచారం. సీనియర్ నేతల మధ్య విబేధాలు తొలగనట్లయితే, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా సిద్ధూ ఉన్నప్పటి నుంచే వారి మధ్య విబేధాలు ఉన్నాయి. అమరీందర్ వ్యతిరేకతను పట్టించుకోకుండా, అయన మంత్రివర్గంలో ఉన్న సిద్ధూ పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం, పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాను కౌగిలించుకోవడం.. మొదలైనవి ఇరువురి మధ్య విబేధాలు తీవ్రమవడానికి కారణమయ్యాయి. -
2గా రాష్ట్ర కాంగ్రెస్.. ఇద్దరు పీసీసీ చీఫ్‌ల నియామకం
* సీమాంధ్రకు రఘువీరా, తెలంగాణకు పొన్నాల * ప్రచార, మేనిఫెస్టో, ఎన్నికల కమిటీలూ రెండేసి * టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియామకం * ప్రచార సారథులుగా సీమాంధ్రకు చిరు, తెలంగాణకు రాజనర్సింహ * మేనిఫెస్టో కమిటీలకు ఆనం, దుద్దిళ్ల సార థ్యం * జానాపై ఫిర్యాదులు రావడంతో పొన్నాలకు చాన్స్ సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు ముందే కాంగ్రెస్‌లో విభజన జరిగిపోయింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు ప్రచార, మేనిఫెస్టో, ఎన్నికల కమిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా మరో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ పీసీసీకి అధ్యక్షుడితోపాటు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించడం కూడా అరుదైన విషయమే. రెండు ప్రాంతాలకూ విడివిడిగా ఎన్నికల కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. వీటికి పీసీసీ అధ్యక్షులే చైర్మన్లుగా వ్యవహరిస్తారు. సీమాంధ్ర ఎన్నికల కమిటీలో 20 మంది, తెలంగాణ కమిటీలో 23 మంది సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల కమిటీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోచైర్మన్‌గా వ్యవహరిస్తారని ఏఐసీసీ వెల్లడించింది. చివరి నిమిషంలో పొన్నాల ఖరారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తొలుత సీనియర్ నేత కె .జానారెడ్డి పేరును ఖరారు చేశారు. గత శనివారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీతో విడివిడిగా భేటీ అయినప్పుడు జానారెడ్డిపై దామోదర రాజనర్సింహ, డి.శ్రీనివాస్‌లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. జానారెడ్డి అదే రోజు తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమవడం, తెలంగాణ కాంగ్రెస్ సమన్వయకర్తగా ఆయన్ని వారంతా ఎన్నుకోవడం, వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి పేరును ప్రతిపాదిస్తూ సంతకాలు చేయడం, టీ కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ జరపడం వంటి అంశాలపై వెంటనే రాహుల్‌గాంధీకి, దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో చివరి నిమిషంలో మార్పులు చేసి, పొన్నాల పేరు ఖరారు చేసినట్టు సమాచారం. జానారెడ్డిని ఎన్నికల కమిటీలో సభ్యునిగా నియమించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కూడా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను ఎంపిక చేసేందుకు దోహదపడింది. అయితే సీమాంధ్రలో రెడ్డి సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెంట వెళ్లినా, తెలంగాణలో కాంగ్రెస్‌తోనే ఉన్నందున వారికి అన్యాయం చేయొద్దన్న నేతల వాదనతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు తెలిసింది. దళితులను విస్మరించారన్న విమర్శలు రాకుండా దామోదర రాజనర్సింహకు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక సీమాంధ్రలో కాపులకు పీసీసీ పీఠం దక్కుతుందని అందరూ భావించారు. అయితే, కాపు ప్రతినిధిగా చిరంజీవికి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించి పీసీసీ అధ్యక్ష పదవిని రఘువీరాకు కట్టబెట్టారు. ఇక్కడ దళిత సామాజికవర్గం నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, పనబాక లక్ష్మిలను ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ కో చైర్పర్సన్లుగా నియమించారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డికి మేనిఫెస్టో సారథ్య బాధ్యతలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుల ఖరారుకు ముందు మంగళవారం మధ్యాహ్నం పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆ తర్వాత రాత్రికి పీసీసీ జాబితా విడుదలైంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మంగళవారం మధ్యాహ్నం దిగ్విజయ్‌సింగ్‌తో, సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు. అవసరమైతే సీమాంధ్రకూ వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమైతే సీమాంధ్రకూ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్యాపదేశంగా చెప్పారు. పీసీసీల నియామకం అనంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో పీసీసీల సమావేశాలు ఉంటాయని ఆయన తెలిపారు. తెలంగాణకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా నియమించారని, సీమాంధ్రకు పీసీసీ ప్రెసిడెంట్‌ను మాత్రమే నియమించడం వెనుక కారణమేమిటని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘రఘువీరారెడ్డితో మాట్లాడాల్సి ఉంది. ఆయన ఇక్కడ లేరు’ అని అన్నారు. అంటే సీమాంధ్రలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారా అని అడగ్గా.. ‘ఉండొచ్చు..’ అని సమాధానమిచ్చారు. సీమాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇదీ.. అధ్యక్షుడు : ఎన్.రఘువీరారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ : కె.చిరంజీవి ప్రచార కమిటీ కోచైర్మన్: డొక్కా మాణిక్య వరప్రసాద్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ : ఆనం రామనారాయణరెడ్డి మేనిఫెస్టో కమిటీ కో చైర్పర్సన్ : పనబాక లక్ష్మి సీమాంధ్ర ఎన్నికల కమిటీ-2014 చైర్మన్: ఎన్.రఘువీరారెడ్డి, సభ్యులు: కిశోర్‌చంద్రదేవ్, బొత్స సత్యనారాయణ, కె.చిరంజీవి, కె.ఎస్.రావు, ఎం.ఎం.పళ్లంరాజు, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, మహ్మద్ అహ్మదుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, కె.సత్యనారాయణ రాజు, ఎ.చక్రపాణి, చింతామోహన్, కొండ్రు మురళీమోహన్, పి.బాలరాజు, నాదెండ్ల మనోహర్ (ఏఐసీసీ విడుదల చేసిన జాబితాలో కోట్ల పేరు రెండుసార్లు అచ్చయ్యింది. అలాగే నాదెండ్ల మనోహర్ పేరుకు బదులుగా ఎన్.భాస్కర్‌రావు-ఏపీ స్పీకర్ అని ఉంది) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు : పొన్నాల లక్ష్మయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ : దామోదర రాజనర్సింహ ప్రచార కమిటీ కో చైర్మన్ : మహ్మద్ షబ్బీర్ అలీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ : మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ-2014 చైర్మన్: పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ్యులు: ఎస్.జైపాల్‌రెడ్డి, డి.శ్రీనివాస్, సి.దామోదర రాజనర్సింహ, కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, ఎం.సత్యనారాయణరావు, సురేష్‌రెడ్డి, ఎం.శశిధర్‌రెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, పి.బలరాంనాయక్, జె.గీతారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్, మల్లు భట్టి విక్రమార్క, డి.కె.అరుణ, రేణుకాచౌదరి, రాపోలు ఆనందభాస్కర్, పి.సుధాకర్‌రెడ్డి, సబితారెడ్డి, మహ్మద్ ఫరీదుద్దీన్, ఎ.ఆర్.ఆమోస్.